Manish Pandey: ఢిల్లీ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో దారుణమైన ఆట తీరు కనబరిచింది. 11 మ్యాచుల్లో ఏడు ఓటములు, నాలుగు విజయాలతో పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే, ఢిల్లీ జట్టు పరిస్థితికి ఒకే ఒక్క ఆటగాడు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఆటగాడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టు పని గోవింద కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. ఎవరా ఆటగాడు..? ఏమిటా కథ..? మీరు చదివేయండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో వరుసగా మొదటి ఐదు మ్యాచ్ ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఆ తర్వాత అనూహ్యంగా ఐదు మ్యాచ్ ల్లో.. నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి ఊహించని కమ్ బ్యాక్ ఇచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ల్లో ఓటములతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఏడాది ఢిల్లీ జట్టు ఘోరంగా విఫలం చెందడం పట్ల అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ జిడ్డు ఆటగాన్ని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతని జట్టులోకి తీసుకున్న తర్వాత చేజేతులారా ఓడిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆ ఆటగాడి ప్రదర్శనతో ఢిల్లీకి తప్పని ఇబ్బందులు..
ఢిల్లీ జట్టు ఘోర పరాభవాలకి కారణం ఒకే ఒక్క ఆటగాడు అన్న విమర్శలు వస్తున్నాయి. ఆ ఆటగాడే మనీష్ పాండే. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన మొట్ట మొదటి భారత క్రికెటర్ మనీష్ పాండే. కొన్నాళ్లపాటు టీమ్ ఇండియాకు గోల్డెన్ హ్యాండ్ గా వెలుగొందిన ఈ ఆటగాడు.. 2022 కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఏటా రూ.11 కోట్లు తీసుకున్నాడు. అయితే, అందులో సగం పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది లేదు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఉన్న మనీష్ పాండే.. తన ఆటను ఏ మాత్రం మార్చుకోలేదు. ఇంత అనుభవం, అంతర్జాతీయ మ్యాచులు ఆడిన తర్వాత కూడా ఇప్పటికీ అలాగే ఆడుతున్నాడు. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఏళ్లు గడుస్తున్నా అతని ఆటలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మనీష్ పాండే హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు ఇలాగే ఆడేవాడు. అప్పుడు రూ.11 కోట్లకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్ వంటి ఓపెనర్లు బాగా ఆడిన తర్వాత క్రీజులోకి వచ్చే మనీష్ పాండే.. బంతులు వృధా చేసి కీలక సమయంలో అవుట్ అయి జట్టుని కష్టాల్లో పడేసేవాడు.
వరుసగా ఫెయిల్ అవుతున్న అవకాశాలు..
మనీష్ పాండే గత కొన్నేళ్లుగా దారుణమైన ఆట తీరును కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ గడిచిన నాలుగు సీజన్లపాటు టీమ్ లో ఉంచారు. మొత్తంగా రూ.44 కోట్ల రూపాయలు అప్పగించింది హైదరాబాద్ జట్టు. ఇక లాభం లేదని ఐపీఎల్ 2022 మెగా వేలంలో విడుదల చేసింది. ఆ తర్వాత లక్నో మనీష్ పాండేను తీసుకుంది. ఆ జట్టు కూడా మనోడి టాలెంట్ చూసి వదిలించుకుంది. ఇక మినీ వేలంలో ఢిల్లీ జట్టు రూ.2.40 కోట్లకు తీసుకుంది. అదే ఆ జట్టు పాలిట శాపంగా మారింది. మనీష్ పాండే ఆడిన పది మ్యాచ్ ల్లో 160 పరుగులు మాత్రమే చేశాడు. మనోడి జిడ్డు బ్యాటింగ్ వల్ల గెలవాల్సిన మ్యాచులు కూడా ఢిల్లీ ఓడిపోయింది. తాజాగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో మనీష్ పాండే పై ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు మండిపడుతున్నారు. తన ఆటతో ఢిల్లీ జట్టుకు సమాధి కట్టేసాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనోడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ఫసక్కే అంటూ కామెంట్లు చేస్తున్నారు. జట్టుకు బలంగా మారాల్సిన ఆటగాళ్లే బలహీనతగా మారడంతో ఢిల్లీ ఈ సీజన్ లో ఘోర పరాభవంతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.