Mumbai Indians: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని చవి చూసింది. సొంత మైదానంలో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే స్వల్ప స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ 17వ సీజన్లో ఎన్నో అంచనాలు ఉన్న ఆ జట్టు వరుసగా మూడు పరాజయాలు అందుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జట్టు కెప్టెన్ మార్పు, ఆటగాళ్ల కూర్పు పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సొంత మైదానంలో కూడా ఓడిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతటి నెగిటివిటీ ప్రచారమవుతున్న క్రమంలో ముంబై జట్టుకు ఒకటి మాత్రం సానుకూలంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే 250 మ్యాచ్ ల రికార్డ్ అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. 17వ సీజన్లో భాగంగా ముంబై జట్టు సోమవారం ముంబై వేదికగా రాజస్థాన్ జట్టుతో లీగ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ద్వారా ఆ జట్టు ఆ ఘనత సాధించింది. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా.. అప్పటి సీజన్ నుంచి ముంబై జట్టు లీగ్ లో కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ 11, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ముందే ముంబై జట్టు ఈ ఘనత అందుకుంది. 17 సంవత్సరాల చరిత్రలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. చెన్నై జట్టు కూడా ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది. అయితే ఆ జట్టుకు సంబంధించిన ఫ్రాంచైజీ పై ఐపీఎల్ నిర్వాహక కమిటీ రెండు సంవత్సరాలు పాటు నిషేధం విధించింది. దీంతో ముంబై చెట్టుకు ఈ అరుదైన ఘనత దక్కింది. ఒకవేళ చెన్నై జట్టు కనుక ఆ రెండు సీజన్లలో కూడా ఆడి ఉండి ఉంటే ఎప్పుడో ఈ రికార్డు అందుకునేది. ఎందుకంటే చెన్నై జట్టు ఐదుసార్లు ట్రోఫీ అందుకుని అత్యధిక సార్లు ప్లే ఆప్ కు చేరిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ లో బెట్టింగ్ వంటి ఆరోపణల నేపథ్యంలో చెన్నై జట్టు 2016, 2017 సీజన్లలో ఆడలేదు.
ఇక అత్యధిక ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినజట్టుగా ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు 241, కోల్ కతా 239, పంజాబ్ 235, చెన్నై 228 మ్యాచ్ లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ జట్టుతో జరిగిన 250 మ్యాచ్ లో ముంబై జట్టు కేవలం 125 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, బ్రేవిస్, నమన్ ధీర్ వంటి వారు గోల్డెన్ డక్ గా వెనుతిరిగారు. పేలవమైన బ్యాటింగ్ తో ముంబై జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయింది. చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన ఈ మ్యాచ్లో ఆటగాళ్లు వెంట వెంటనే పేవిలియన్ చేరడంతో దారణమైన ఓటమిని మూటగట్టుకుంది.