Katchatheevu Island: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడుకు సమీపంలో ఉన్న కచ్చతీవు దీవిపై మళ్లీ రాజకీయం మొదలైంది. 50 ఏళ్లనాటి అంశాన్ని ప్రధాని మళ్లీ తెరపైకి తెచ్చి కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తున్నారు. ‘కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్ ఎలా అప్పగించిందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది భారతీయులందరికీ కోపం తెప్పించేది. కాంగ్రెస్‌ను నమ్మలేమని మరోసారి స్పష్టమైంది. భారత ఐక్యతను బలహీనపరచడం, దేశ ప్రయోజనాలకు హాని కలిగించడమే 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని’’ ఎక్స్‌లో మోదీ విమర్శించారు. దేశ ఐక్యతను ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తోందని మోదీ ఆరోపించారు.
అకస్మాత్తుగా తెరపైకి..
కచ్చతీవు ద్వీపం వివాదం.. ఆదివారం ఓ పత్రికలో ప్రచురితమైన కథనంలో మొదలైంది. 1974లో భారత ప్రభుత్వం మెతకవైఖరి కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని కథనంలో ఆరోపించింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘డీఎంకే, కాంగ్రెస్ వాళ్లు వాళ్లకు ఏమీ తెలియనట్లుగా చూస్తున్నాయి. అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయి. అంతా ఇపుడే జరిగినట్లు, అసలు చరిత్ర లేనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ వివాదం ఎలా మొదలైందో ప్రజలకు తెలియాలి. ఇక ఈ ద్వీపానికి సంబంధించి పార్లమెంటులో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
ఎక్కడుందీ కచ్చతీవు..
తమిళనాడుకు సమీపంలో ఈ కచ్చతీవు ద్వీపం ఉంది. తమిళనాడు అది రాజా రామ్‌నాథ్ రాచరిక ప్రాంతమని చెబుతోంది. అయితే శ్రీలంకలో భాగమని చెప్పుకునేందుకు ఎలాంటి ఆధారం లేదని భారత్ అంటోంది. ఈ సమస్య 1960లో ప్రారంభమైంది. 1974లో భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దును నిర్ణయించారు. భారత తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల భూమిపై క్లెయిమ్‌ను భారత్ వదులుకున్నట్లు పత్రాలు చూపిస్తున్నాయి.
తమదిగా చెప్పుకుంటున్న శ్రీలంక..
ఇక శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత కచ్చతీవు ద్వీపాన్ని తమదిగా చెప్పుకుంటూ వచ్చింది. తమ అనుమతి లేకుండా కచ్చతీవుపై భారత నౌకాదళం విన్యాసాలు చేయకూడదని సూచించింది. ఇక 1955లో ‘సిలోన్ ఎయిర్ ఫోర్స్’ కచ్చతీవు ద్వీపంలో విన్యాసాలు ప్రారంభించింది. 1961, మే 10న నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్పందించారు. దీనిని అసంబద్ధమైనదిగా కొట్టిపడేశారు. ఈ చిన్న ద్వీపానికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వడంలేదని, దానిపై క్లెయిమ్‌ను వదులుకోవడానికీ సిద్ధమేనని ప్రధాని నెహ్రూ చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించిన నోట్ అప్పటి కామన్వెల్త్ సెక్రటరీ వైడీ గుండేవియా రూపొందించారు. ఈ నోట్‌ను 1968లో విదేశీ వ్యవహారాల శాఖ పంచుకుంది. ఈ నోట్ కచ్చతీవుపై భారత వైఖరిని చూపుతుందని, 1974లో భారత్ అధికారికంగా ఈ ద్వీపాన్ని వదులుకుంది.
రామనాథపురం రాజుకు..
ఈస్ట్ ఇండియా కంపెనీ రామనాథపురం రాజుకు కచ్చతీవు ద్వీపం, దాని చుట్టుపక్కల చేపలు పట్టడం, ఇతర వనరుల కోసం సమీందారి హక్కులు ఇచ్చిందని సెతల్వాద్ గుర్తు చేశారు. జమీదారీ హక్కులు 1875 నుంచి 1948 వరకు కొనసాగినట్లు తెలిపారు. తర్వాత హక్కులు మద్రాసు రాష్ట్రానికి వెళ్లాయని చెప్పారు.
ఇందిర–బండారి నాయకే మధ్య చర్చలు..
ఇక 1974–76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక నాటి అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకే మధ్య కచ్చతీవు ద్వీపంపై చర్చలు జరిగాయి. సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక అధీనంలోకి వెళ్లింది. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుంచి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఏమంటోంది?
కచ్చతీవుపై తమను మోదీ ఇరుకున పెట్టడంతో కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలున్నాయనే దేశ సమగ్రత, జాతీయ భద్రత సమస్యలపై మోదీ అకస్మాత్తుగా మేల్కొన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దులకు సంబంధించి’ ఒప్పందం చేసుకున్నట్లే 1974లో ‘స్నేహపూర్వక ఒప్పందం’ కింద కచ్చతీవు దీవిని అప్పగించారని ఖర్గే అన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో స్నేహపూర్వక ఒప్పందం కింద బంగ్లాదేశ్‌కు 111 ఎన్‌క్లేవ్‌లు (సరిహద్దులో ఉన్న చిన్న ప్రాంతాలు) ఇచ్చారని, కేవలం 55 ఎన్‌క్లేవ్‌లు మాత్రమే భారత్‌కు వచ్చాయని ఖర్గే గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆరోపణలపై డీఎంకే స్పందించింది. 1974లో ఈ ఒప్పందాన్ని తాము వ్యతిరేకించామని వెల్లడించింది.