MSK Prasad: చంద్రబాబు వల్ల ఎమ్మెస్కే చీఫ్ సెలక్టర్ కాలేదట.. మరీ ఎలా అయ్యాడు?

రాయుడు అభిమానులు, వైసీపీ నేతల ట్రోల్‌తో ఎమ్మెస్కే స్పందించక తప్పలేదు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను చీఫ్‌ సెలెక్టర్‌ కాలేదని స్పష్టం చేశాడు.

Written By: Raj Shekar, Updated On : June 19, 2023 5:15 pm

MSK Prasad

Follow us on

MSK Prasad: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్, తెలుగు ఆటగాడు ఎమ్మెస్కే.ప్రసాద్‌ తనపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడి వల్లనో లేక మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రికమెండేషన్‌లోనో తాను బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ కాలేదని తెలిపాడు. తనను డీఫేమ్‌ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ నుంచి బీసీసీఐ ఛీప్‌ సెలెక్టర్‌గా ఎదిగిన తీరును ఎమ్మెస్కే వివరించాడు.

ఎమ్మెస్కేను ట్రోల్‌ చేస్తున్న రాయుడు అభిమానులు..
క్రికెటర్‌గా గొప్ప కెరీర్‌ లేని ఎమ్మెస్కే. ప్రసాద్‌ బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే అప్పట్లో అంతా తెలుగువాడు చీఫ్‌ సెలక్టర్‌ అయినందుకు సంతోషపడ్డారు. కానీ రాయుడును వరల్డ్‌ కప్‌ టీంకు ఎంపిక చేయకపోవడం, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఎమ్మెస్కేనే కారణం అన్న విషయం తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆంధ్రా కుల రాజకీయాలతోనే ఎమ్మెస్కే రాయుడును తొక్కేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కేను రాయుడు అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. చీఫ్‌ సెలెక్టర్‌గా ఎమ్మెస్కేను ఎంపిక చేయడం వెనుక అదృశ్య హస్తముందని పేర్కొంటున్నారు.

దయాదాక్షిణ్యాలతో రాలేదు..
రాయుడు అభిమానులు, వైసీపీ నేతల ట్రోల్‌తో ఎమ్మెస్కే స్పందించక తప్పలేదు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను చీఫ్‌ సెలెక్టర్‌ కాలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు తాను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి దక్కిందన్నాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌లో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలతో అప్పటి ప్రెసిడెంట్‌ గోకరాజు గంగరాజు అడ్మినిస్ట్రేషన్‌లోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. చాముండేశ్వరీనాథ్, గోకరాజు గంగరాజు మధ్య విభేదాలు రావడంతో తటస్థ వ్యక్తిగా.. క్రికెట్‌ తెలిసిన వాడిగా నన్ను భావించి ఈ ఆఫర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. అప్పుడు నేను బీడీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నానని తెలిపాడు. ముందుగా ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌లో పనిచేసేందుకు చాలా సంశయించానని, తర్వాత తల్లి లాంటి అసోసియేషన్‌ ఇబ్బందుల్లో ఉండటం చూడలేక 28 ఏళ్ల బీడీఎల్‌ సర్వీస్‌ను వదలుకొని విజయవాడ వెళ్లానని చెప్పుకొచ్చారు.

ఆరేళ్లు అసోసియేషన్‌ కోసం..
ఆంధ్ర అసోసియేషన్‌లో 6 ఏళ్లు తీవ్రంగా కష్టపడ్డానని తెలిపాడు. 13 జిల్లాలు తిరిగి 18 ఫస్ట్‌ క్లాస్‌ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. నాలుగు రెసెడెన్షియల్‌ అకాడమీలు, 2 ఇంటర్నేషనల్‌ స్టేడియాలు నిర్మించినట్లు చెప్పారు. 80 లక్షల ఉపకారవేతనాలు అందించే క్యార్రమం చేపట్టామన్నారు. ఈ పనికి గోకరాజు గంగరాజు అండగా నిలిచారని తెలిపాడు.

రాయుడిని జట్టులోకి తీసుకొచ్చా..
ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌లో తాను చాలా మార్పులు తీసుకొచ్చానని ఎమ్మెస్కే తెలిపాడు. వీటిని ఎప్పటికప్పుడు బీసీసీఐకి నివేదించేవాడినన్నారు. నా సేవలను అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సహా బోర్డు సభ్యులు గుర్తించారన్నారు. బీసీసీఐ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో 40 నిమిషాలు తాను ఇచ్చిన ప్రజంటేషన్‌కు అందరూ ఫిదా అయ్యారని తెలిపారు. ఇక రాయుడును టీమిండియాలోకి తీసుకువచ్చింది కూడా తానేనని చెప్పారు.

సందీప్‌పాటిల్‌ నాయకత్వంలో..
చాముండేశ్వరినాథ్‌లా సెలెక్టర్‌ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పదవికి దరఖాస్తు చేశానని చెప్పాడు. సందీప్‌ పాటిల్‌ నాయకత్వంలో సెలెక్టర్‌గా పని చేశానని తెలిపాడు. క్రికెటర్లు ఆడే ప్రతీ బంతిని అనాలసిస్‌ చేసి చెప్పేవాడిని. తదుపరి సెలెక్షన్‌ కమిటీకి ఇంటర్వ్యూ జరిగినప్పుడు నా పనితీరు నచ్చి సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ను చేశారని తెలిపారు.