MS Dhoni : ఈ ఐపిఎల్ సీజన్లో చెన్నై జట్టు తన చివరి మ్యాచ్ ఆడుతోంది. పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై జట్టు.. గుజరాత్తో తలపడుతున్న మ్యాచ్లో గెలవడం లాంచనమే. ఈ సీజన్లో అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన చెన్నై జట్టు.. చివరి మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 230 రన్స్ స్కోర్ చేసింది. కాన్వే, బ్రేవిస్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. గుజరాత్ జట్టు బౌలర్లు దారుణంగా తేలిపోయారు. ఈ మ్యాచ్లో చెన్నై కంటే గెలవాల్సిన అవసరం గుజరాత్ జట్టుకే ఉంది. ఎందుకంటే గుజరాత్ జట్టు గెలిస్తేనే టాప్ -2 లో నిలవడానికి అవకాశం ఉంటుంది. కానీ దానిని చేజేతులా గుజరాత్ కోల్పోయింది.
Also Read : గుజరాత్ కు దిమ్మతిరిగింది.. టాప్ -2 ఆశలు గల్లంతు చేసిన చెన్నై..
ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు తాత్కాలిక సారథి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు దిగలేదు. మైదానంలో కూడా అతడు అంత ఉత్సాహంగా లేడు. కొన్ని సందర్భాల్లో డిఆర్ఎస్ అప్పీల్ చేయాల్సిన తరుణంలోనూ సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ధోని వచ్చే సీజన్ ఆడతాడా? అతడికి ఇదే చివరి మ్యాచ్చా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.. వాస్తవానికి ధోని ఐపీఎల్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతాడని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అది ఊహాగానమని తర్వాత తేలిపోతోంది. కానీ గుజరాత్ తో తలపడుతున్న సందర్భంలో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని కొందరు అభిమానులు బలంగా వాదిస్తున్నారు.
” ధోని వయసు 43. సుదీర్ఘకాలంగా అతడు క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ చేయాలంటే అతడికి ఇబ్బందిగా ఉంటున్నది. కాళ్ల నొప్పులు అతడిని వేధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అతడు ఐపిఎల్ లో ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందని అనుకోవడం లేదు. పైగా అతడు ఐపిఎల్ ఆడాలంటే కుటుంబానికి నెలలపాటు దూరంగా ఉండాలి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో అతడు శిక్షణ తీసుకోవాలి. ఇవన్నీ చేయడం కంటే ధోని ఐపీఎల్ నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదనే భావనలో ఉన్నట్టు మాకు తెలుస్తోందని” చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే తాను స్ట్రెచర్ మీద ఉన్నా సరే మైదానంలోకి తీసుకొచ్చి ఆడిస్తారని ఇటీవల ధోని చెన్నై మేనేజ్మెంట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ ప్రకారం ధోని ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోడని కొంతమంది బలంగా వాదిస్తున్నారు. చెన్నై జట్టు యాజమాన్యానికి, ధోనికి అభినాభావ సంబంధం ఉందని.. దానిని ఎవరూ బ్రేక్ చేయలేరని వారు చెబుతున్నారు. ధోని రిటైర్మెంట్ కనుక తీసుకుంటే.. అది చెన్నై జట్టుకు కోలుకోలేని ఇబ్బందేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల చెన్నై జట్టు సారథి రుతు రాజ్ గైక్వాడ్ గాయపడితే.. తాత్కాలిక నాయకుడిగా ధోనీ వైపు మాత్రమే చెన్నై మేనేజ్మెంట్ మొగ్గు చూపించిందని.. ఇతర ప్లేయర్లపై అంతగా ఆసక్తి చూపించలేదని.. దీనిని బట్టి చెన్నైకి, దీనికి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చని వారు వివరిస్తున్నారు.