MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2008 నుంచి ఇప్పటివరకు చెన్నై జట్టులో అతడు ఉన్నాడు. గత సీజన్ నుంచి సాధారణ ఆటగాడు గానే ధోని ఉన్నాడు. కెప్టెన్ పదవి నుంచి అతడు తప్పుకున్నాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. చెన్నై జట్టును ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిపిన చరిత్ర మహేంద్ర సింగ్ ధోనిది. అందువల్లే చెన్నై అభిమానులు అతడిని తలా అని పిలుచుకుంటారు. గత 17 సంవత్సరాలుగా అనుబంధం ఉండడంతో ధోనిని చెన్నై జట్టు ఇటీవల మెగా వేలంలో అలానే ఉంచుకుంది. గత సీజన్లో ధోని గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ.. చెన్నై జట్టు యాజమాన్యం అతడిని అలాగే కొనసాగిస్తోంది.
అంత పెన్షన్ ఇస్తోంది
ధోనికి డబ్బుకు కొదవలేకపోయినప్పటికీ.. బిసిసిఐ ప్రతినెల పెన్షన్ ఇస్తున్నది. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007లో టి20 ప్రపంచ కప్ గెలుచుకుంది. 2011లో వన్డే ప్రపంచ కప్ సాధించింది. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇలా రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ ఇస్తుంది. ప్రతినెలా బోర్డు నుంచి ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. ఈ పథకానికి 2022లో నాటి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనేక మార్పులు చేశారు. ఆటగాళ్లకు ఆర్థిక భరోసా కలిగించడానికి ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీంతో ఆటగాళ్లకు వచ్చే పెన్షన్ చాలా వరకు పెరిగింది. ఇక ఈ పథకం కేవలం పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆటగాళ్ల క్రీడా జీవితం ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు.. మహేంద్ర సింగ్ ధోని భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 t20లు ఆడాడు. వీటి ప్రకారం అతడికి బీసీసీఐ నుంచి ప్రతినెల 70 వేల వరకు పెన్షన్ వస్తుంది. బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ ను ధోని తీసుకున్నప్పటికీ.. వాటిని చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తాడని తెలుస్తోంది. అయితే ప్రచారాన్ని పెద్దగా కోరుకోని ధోని.. తన చారిటీ కార్యక్రమాల విషయాలను బయటకు తెలియకుండా గోప్యత పాటిస్తాడు. తన స్వరాష్ట్రమైన జార్ఖండ్లో పేద పిల్లలకు, పేద రైతులకు ధోని సహాయ సహకారాలు అందిస్తాడు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ధోని జాగ్రత్త పడతాడు. ఎందుకంటే ధోని మొదటి నుంచి కూడా ప్రచారానికి దూరంగా ఉంటాడు. ఇక ధోని ప్రతి ఏడాది తన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని విద్యార్థుల చదువుకు కేటాయిస్తాడు. క్రీడల్లో సత్తా చాటుతున్న ఆటగాళ్లకు ఇస్తాడు. కాకపోతే ఈ విషయాలను బయటకు చెప్పుకోడు.