Mohammed Shami : శస్త్ర చికిత్స అనంతరం షమీ కోలుకున్నాడు. సుదీర్ఘకాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అతడు ఇటీవల లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.. ఆ తర్వాత జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని రికార్డు కలిగి ఉన్న షమీ.. త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తయినప్పటికీ.. అందులో షమీకి చోటు లభించకపోయినప్పటికీ.. అతడు జాతీయ జట్టులోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నాడు.. వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా సాధించకపోయినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సత్తా చాటాడు. కాలికి గాయం అయిన నేపథ్యంలో.. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత అతడు న్యూజిలాండ్ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. దక్షిణాఫ్రికా సిరీస్ లోనూ అతడికి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు.
ఫిట్నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు..
శస్త్ర చికిత్స అనంతరం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ రీహబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. అయితే దేశవాళి క్రికెట్లో తనను తాను నిరూపించుకోవడం కోసం రంజీ ఆడతానని ప్రకటించాడు.. అందులో పూర్తిస్థాయిలో సత్తా చాటి.. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని ప్రకటించాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీకి అవకాశం లభించలేదు. అయితే అయినప్పటికీ జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే అతని లక్ష్యం కాబట్టి.. బెంగాల్ తరఫున అతడు రంజి ఆడతాడని అందరూ అనుకున్నారు. అయితే తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్ లకు సంబంధించి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం జట్టును ప్రకటించింది. అందులో షమీకి అవకాశం లభించలేదు. కర్ణాటక జట్టుతో నవంబర్ 6 నుంచి బెంగాల్ జట్టు నాలుగో రౌండు రంజి మ్యాచ్ లో తలపడుతుంది. ఇక నవంబర్ 13 నుంచి మొదలయ్యే 5 రౌండ్లో మధ్యప్రదేశ్ జట్టుతో పోటీపడుతుంది. ఇక రంజీ ట్రోఫీకి సంబంధించి తొలి దశ టోర్నీకి ఇదే ఆఖరి రౌండ్ . రెండవ దశలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచులు జరుపుతారు. రెండవ దశలో సాగే రంజీ ట్రోఫీకి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీలు నిర్వహించనున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టుతో ఆడేందుకు అభిషేక్ పొరేల్, అభిమన్యు ఈశ్వరన్, ముఖేష్ కుమార్ భారత – ఏ జట్టుతో వెళ్లిపోయారు. ఫలితంగా వారంతా బెంగాల్ రంజీ టీమ్ కు దూరం కావాల్సి వచ్చింది. ఫలితంగా షమీ రీ ఎంట్రీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ అతనికి అవకాశం లభిస్తే చాంపియన్స్ ట్రోఫీలో ఆడవచ్చని తెలుస్తోంది.