Mohammed Shami IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మహమ్మద్ షమీ అదరగొడుతున్నాడు. తాజాగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లోను నాలుగు కీలక వికెట్లు తీసి ఢిల్లీ జట్టు వెన్నుముక విరిచాడు. దీంతో ఢిల్లీ జట్టు నామమాత్రపు స్కోర్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సీజన్ మొత్తం అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు షమీ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ లో మహమ్మద్ షమీ అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బౌలర్ కీలక ప్లేయర్ గా మారిపోయాడు. 2013లో ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ఆడాడు. కొంతకాలం కోల్కతా జట్టుకు ఆడిన తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అత్యంత వేగవంతమైన బంతులతో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టగల సామర్థ్యం షమీ సొంతం. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లోను అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ జట్టులోని కీలక ప్లేయర్లైన నలుగురు వికెట్లను పడగొట్టి ఢిల్లీ జట్టు కోలుకోకుండా చేశాడు.
నాలుగు వికెట్లతో కకావికలం చేసిన షమీ..
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు మహమ్మద్ షమీ. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన షమీ 17 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరియర్ లో షమీకి ఇదే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఢిల్లీ జట్టు టాప్ ఆర్డర్లో కీలకమైన ఫిలిప్ సాల్ట్ 0(1), ప్రియమ్ గార్గ్ 10(14), రీలీ రోసో 8(6), మనీష్ పాండే 1(4) వికెట్లను పడగొట్టి ఢిల్లీ జట్టు కోలుకోకుండా చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే షమీ బౌలింగ్ తో ఢిల్లీ జట్టు 130 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.
నిప్పులు చెరిగే బంతులతో విజృంభన..
మహమ్మద్ షమీ ఐపీఎల్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వేగవంతమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బౌలింగ్ కూడా పొదుపుగా చేస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 35 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. 17 వికెట్లను పడగొట్టాడు. 7.06% ఎకానమీతో 14.53 యావరేజ్ తో బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు షమీ. పేస్ బౌలింగ్ ఎటాక్ కు దిగే షమీ బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అత్యంత కష్టంగా మారుతోంది. బంతుల్లో వేగంతోపాటు బౌలింగ్ లో వైవిధ్యం కూడా ఉంటుండడంతో షమీకి కలిసి వస్తోంది.