Karnataka Assembly Elections 2023: కన్నడ సీమలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వంటి వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మే 10న జరిగే పోలింగ్ కు మరో ఆరు రోజులు మాత్రమే ఉన్న వేళ కర్ణాటకలో మాటల తూటాలు పేలుతున్నాయి.. అంతేకాదు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు మేనిఫెస్టోలతో ముందుకు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ జపం చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే అది డబుల్ డిజాస్టర్ గా మారుతుందని ఎద్దేవా చేస్తోంది. ఈసారి మళ్లీ కింగ్ మేకర్ నేనే అవుతానని జెడిఎస్ భావిస్తోంది. గత 30 ఏళ్లలో ఇంత పోటాపోటీగా కర్ణాటక ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
తాయిలాల మీద తాయిలాలు
ప్రజలకు ఉచితంగా ఇచ్చే సంక్షేమ పథకాలను తాయిలాలు అంటూ రాష్ట్రాలను నిత్య విమర్శించే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో మాత్రం దారిద్య రేఖకు దిగువన ఉన్న వారిపై సంక్షేమ హామీలు గుప్పించింది. మూడు హిందూ పండుగలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అందుబాటు ధరల్లో ఆహార క్యాంటిన్లు, రోజు అర లీటర్ పాలు, వృద్ధులకు ఉచిత ఆరోగ్య చెకప్ లు చేస్తామంటూ వాగ్దానాలు చేసింది. ఉమ్మడి పౌరస్మృతి ని అమలు చేస్తామని తన సైద్ధాంతిక అంశాలు జోడించింది.
కాంగ్రెస్ పార్టీ కూడా
కాంగ్రెస్ నిరుద్యోగం, మహిళ సాధికారత మీద దృష్టి పెట్టింది. వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంటి గృహలక్ష్మికి ప్రతి నెల 2000, బిపిఎల్ కుటుంబాలకు ఆ నెలకు 10 కిలోల ధాన్యాలు, నిరుద్యోగులకు నెలవారి భృతి, స్త్రీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటివి కల్పిస్తామని ప్రకటించింది. అయితే ఈ రెండు పార్టీలు పోటాపోటీగా సంక్షేమ మంత్రం జపించడం విశేషం. కూడు, గూడు, గుడ్డ లాంటి ప్రాథమిక సంక్షేమం అందించకుండా కేవలం రోడ్ల విస్తరణ లాంటి అభివృద్ధి పైన దృష్టి పెట్టడం వల్ల ప్రజల స్థితిగతుల్లో మార్పులు ఉండవని కర్ణాటక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం తప్పేమీ కాదని వారు అంటున్నారు. పోలింగ్ సమయానికి 8 రోజుల ముందు ఇవి ప్రకటించి వాటిని కంటి తూర్పు చేయకూడదని వారు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల వాగ్దాన పత్రాలు అమలు చేసే చిత్తశుద్ధి ఎన్ని పార్టీలకు ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే సమయంలో మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక పార్టీలు అమలు చేశాయా అనే దానిపై ఎన్నికల సంఘం ఆడిటింగ్ చేయడం నిజంగా అభిలషణీయం.