https://oktelugu.com/

Mohammed Shami: ఆసుపత్రి బెడ్ పై టీమిండియా స్టార్ బౌలర్.. ప్రధాని మోడీ కామెంట్స్ వైరల్

మడమ గాయంతో ఇబ్బంది పడుతున్న షమీ గతంలో పలుమార్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. అయినప్పటికీ అది తగ్గుముఖం పట్టలేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 27, 2024 / 02:50 PM IST
    Follow us on

    Mohammed Shami: వన్డే వరల్డ్ కప్-2023 లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఆసుపత్రి పాలయ్యాడు. వరల్డ్ కప్ తర్వాత మైదానంలో కనిపించని అతడు.. కాలి మడమ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ గాయం వల్లే సౌత్ ఆఫ్రికా పర్యటన, ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ కు సంబంధించి హైదరాబాద్ వచ్చాడు. ఇష్టమైన నటులు ఎవరని విలేకరులు అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని తడుముకోకుండా చెప్పాడు. అలాంటి షమీ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఆసుపత్రి బెడ్ మీద పడుకున్న ఫోటోలను ట్విట్ చేశాడు. అయ్యో ఏమైందని నెటిజన్లు అనుకునే లోగా.. దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించాడు.

    మడమ గాయంతో ఇబ్బంది పడుతున్న షమీ గతంలో పలుమార్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. అయినప్పటికీ అది తగ్గుముఖం పట్టలేదు. ఇటీవల స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో ఆ గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని దేశం కోసం ఆడాడు. ఇక ఆ తర్వాత ఆ గాయం మళ్ళీ తిరగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం లండన్ లో ఈ శస్త్ర చికిత్స జరిగింది. తను ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోలను షమీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కాలి మడమ గాయం ఇబ్బంది పెడుతోంది. దానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. నా కాళ్ళపై నేను నడిచి మళ్ళీ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తుంటానని షమీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోలను దానికి జత చేశాడు. ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మహమ్మద్ షమీ IPL-2024 లో ఆడే అవకాశాలు లేకపోవచ్చు. షమీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు.. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ కు అతడు అందుబాటులోకి వస్తాడని జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది.

    షమీ తన శస్త్ర చికిత్స కు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ ద్వారా పంచుకున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.. షమీ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇటువంటి పరామర్శను ఊహించని షమీ ఒకసారిగా అవాక్కయ్యాడు. ప్రధాని చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపాడు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు.. తనను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం మోడీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.