https://oktelugu.com/

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ చేసిన పని గుండెల్ని పిండేసింది.. నెటిజన్లు ఫిదా..

టీ 20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాలో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. గ్రూప్ దశ మ్యాచ్ లలో ఆడిన సిరాజ్.. సూపర్ -8, సెమీస్, ఫైనల్ మ్యాచ్ లలో మాత్రం రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 6, 2024 5:28 pm
    Mohammed Siraj

    Mohammed Siraj

    Follow us on

    Mohammed Siraj: టీం ఇండియా టీ – 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గురువారం ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విక్టరీ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. లక్షలాదిమంది అభిమానులు రావడంతో ముంబై మహానగరం జనసంద్రంగా మారింది.. ఆ తర్వాత వాంఖడె స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను సన్మానించింది. 125 కోట్ల రూపాయల విలువైన చెక్కును అందించింది. ముంబై నగరానికి అభిమానులు భారీగా పోటెత్తిన నేపథ్యంలో.. ఆ దృశ్యాన్ని.. 2022లో అర్జెంటీనా ఫిఫా ఫుట్ బాల్ కప్ గెలిచినప్పుడు దృశ్యాన్ని పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఔత్సాహిక నెటిజన్లు పోస్ట్ చేశారు.

    టీ 20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాలో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. గ్రూప్ దశ మ్యాచ్ లలో ఆడిన సిరాజ్.. సూపర్ -8, సెమీస్, ఫైనల్ మ్యాచ్ లలో మాత్రం రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. ముంబై లో జరిగిన సన్మాన సభలో ముందు వరుసలో ఉండి సందడి చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్ళిన సిరాజ్ కు శుక్రవారం హైదరాబాదు నగరవాసులు ఘన స్వాగతం పలికారు. క్రికెట్ పై అభిమానంలో వారు ముంబై అభిమానులను మించిపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అడుగునా నినాదాలు చేస్తూ, పూలదండలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెహదీపట్నం సరోజిని ఆసుపత్రి నుంచి మొదలైన ర్యాలీ ఉద్గా మైదానం వరకు కొనసాగింది. జాతీయ జెండా పట్టుకున్న సిరాజ్ అభిమానులకు అభివాదం చేశాడు. ఈ సందర్భంగా బడే మియా హైదరాబాద్ పేస్ గన్ అంటూ అభిమానులు భారీగా నినాదాలు చేశారు..

    తనకు అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలకడంతో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభిమానుల సత్కారాన్ని చూసి గర్వంతో ఉప్పొంగాడు. జాతీయ జెండాను చూస్తూ విజయ గర్వాన్ని ప్రదర్శించాడు. త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని రెపరెపలాడించాడు. పేద కుటుంబంలో జన్మించిన సిరాజ్.. అంచలంచలుగా ఎదిగాడు. టీమిండియాలో స్థానం సంపాదించి కీలక ఆటగాడిగా నిలదొక్కుకున్నాడు.. వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు టాప్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. అంతకుముందు జరిగిన ఆసియా కప్ లోనూ సిరాజ్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. విజయ ప్రదర్శన అనంతరం మహ్మద్ సిరాజ్ తన మెడలో వేసిన మెడల్ ను తల్లి మెడలో వేశాడు. ఆమె ఆ మెడల్ చూసి గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ ఫోటోను సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. “శభాష్ సిరాజ్.. అమ్మకు ఆనందాన్నిచ్చావ్. నీ మెడల్ ఆమెలో గర్వాన్ని నింపింది. ఇది మా గుండెల్ని పిండేసిందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.