Balance In Life: సమయాన్ని వృధా చేసే వారు ఎక్కువ అయితే సమయం మిగలకుండా రోజులను గడుపుతున్నవారు కూడా ఉన్నారు. 24 గంటలు కాకుండా మరిన్ని గంటలు ఉంటే బాగుండు అనుకుంటున్నారు కొందరు. ఇక ఈ సాంకేతిక యుగంలో వర్క్ కల్చర్ వల్ల ఉద్యోగాలను, వ్యక్తిగత సమయాన్ని బాలెన్స్ చేయడం చాలా కష్టం. ఓకే సారి వర్క్, ఇంట్లో పనులు, పిల్లలు అంటూ ఎన్నో పనులు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే 8-8-8 రూల్ గురించి తెలుసుకుంటే మీరు కాస్త రిలీఫ్ అవ్వచ్చు. ఇంతకీ ఏంటీ ఈ రూల్ అనుకుంటున్నారా?.
విలువైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేదే ఈ రూల్. వృత్తి, వ్యక్తిగతమైన జీవితాలను సమతుల్యం చేసుకొనేందుకు ఇది ఒక మంచి ఆయుధం. అయితే ఈ రూల్ ప్రకారం.. రోజుకు ఉండే 24 గంటలను ఎనిమిది గంటల చొప్పున విభజించుకోవాలి. 8 గంటలను ఉద్యోగానికి వినియోగించాలి.. మరో 8గంటలను మీ అలవాట్లు, కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం కేటాయించాలి. మిగిలిన ఎనిమిది గంటలను కచ్చితంగా నాణ్యమైన నిద్ర కోసం కేటాయించాలి. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కుటుంబ సభ్యులకు స్నేహితులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ లక్ష్యాలను కూడా సులువుగా చేరుకోవచ్చు.
అందరికీ ఈ సమయం సరిగ్గా సెట్ కాదు. అందుకే మధ్యమధ్యలో విభజించుకొని వినియోగించుకోవాలి . మీ జీవన శైలిని ఆరోగ్యంగా, సంతృప్తికరంగా మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రూల్.ఇలా భాగాలుగా విభజించడం వల్ల పని మీద ఫోకస్ పెడతారు కూడా. దీనివల్ల ముఖ్యమైన పనులు కూడా నిర్లక్ష్యం కావు అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబం/మీ అభిరుచులకు కేటాయించే సమయాన్ని కూడా నాణ్యతగా గడపవచ్చు. సంగీతం, పుస్తక పఠనం వంటి అలవాట్లతో మీ ఊహాశక్తి పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గి సహజ ప్రక్రియలు మెరుగవుతాయి అంటున్నారు నిపుణులు. ఈ రూల్‌ని ప్రతి రోజు అమలుచేయడం సులభం కాదు. ఇలా చేయడానికి చాలా రకాల అడ్డంకులు వస్తాయి. వాతావరణంలో మార్పులు, ఒక్కోసారి నాణ్యమైన నిద్రకు భంగం కలిగడం వంటివి కూడా సంభవిస్తాయి. ఇక సహచరులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌లో బాస్ ల రూపంలో ఒత్తిల్లు కూడా ఉంటాయి. కానీ సరైన ప్రణాళిక వేసుకొని అంకితభావంతో ఈ రూల్ పాటించాలి. కొన్ని సార్లు సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.