Ind Vs Nz 2nd Test: బెంబేలెత్తిస్తున్న సాంట్నర్.. తడబడిన టీమిండియా.. పూణే టెస్ట్ లో లంచ్ బ్రేక్ తర్వాత పరిస్థితి ఏంటంటే..

పూణే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ సాంట్నర్ ధాటికి పెవిలియన్ కు క్యూ కడుతున్నారు..

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2024 12:31 pm

Ind Vs Nz 2nd Test(6)

Follow us on

Ind Vs Nz 2nd Test: తొలి రోజు న్యూజిలాండ్ జట్టును 259 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా.. బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే సౌతి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా సాంట్నర్ మెలితిప్పే బంతులకు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఆటగాళ్లు అతడి చేతిలో ఔట్ అయ్యారు. దీంతో టీం ఇండియా తీవ్ర కష్టాల్లో పడింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసి సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఫిలిప్స్ బౌలింగ్లో మిచెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 రన్స్ చేసి.. దూకుడు మీద కనిపించిన గిల్ సాంట్నర్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండవ రోజు అప్పటికే టీమిండియా కీలకమైన మూడు వికెట్లను నష్టపోయింది. అయితే ఆ తర్వాత కూడా టీమిండియా వికెట్ల పతనం మరింత వేగంగా కొనసాగింది. 19 బంతుల్లో 18 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన రిషబ్ పంత్ ఫిలిప్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్ లో 150 పరుగులు చేసిన సర్ప రాజ్ ఖాన్ 11 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్ లో ఓరూర్కే కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చెన్నై టెస్ట్ లో సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో కనిపించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ టెస్ట్ లోనూ తేలిపోయాడు. 4 పరుగులు మాత్రమే చేసి సాంట్నర్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో టీమ్ ఇండియా 103 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆడుతున్న జడేజా, సుందర్

7 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడిన టీమ్ ఇండియాను జడేజా (11), సుందర్ (2) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.. పూణే మైదానం స్పిన్ వికెట్.. దీంతో న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ నిప్పులు కురిపిస్తున్నాడు. గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ వంటి టాప్ ఆటగాళ్లు సాంట్నర్ చేతిలో ఔట్ అయ్యారు.. వీరిలో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతిని సరిగ్గా ఆడ లేకపోవడంతో అది అతడి వికెట్లను పడగొట్టింది. దీంతో ఒక పరుగు మాత్రమే చేసిన విరాట్ నిరాశతో మైదానాన్ని వీడాడు. అతడు తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ తొమ్మిది బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. సౌతి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో టీం ఇండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఐదుగురిని క్లీన్ బౌల్డ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. లంచ్ బ్రేక్ సమయం వరకు 7 వికెట్ల కోల్పోయి 107 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. ఇంకా న్యూజిలాండ్ కంటే 152 పరుగులు వెనుకబడి ఉంది.