MI Vs RCB: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. పేరుకు క్యాష్ రీచ్ లీగ్ అయినప్పటికీ.. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్ లు ప్రేక్షకులకు అమితమైన క్రీడానందాన్ని అందిస్తున్నాయి. ఈ పరంపరలో గురువారంనాడు ముంబై వేదికగా వాంఖడే మైదానంలో బెంగళూరు, ముంబై జట్లు పోటీ పడనున్నాయి. ముంబైకి ఇది నాలుగో మ్యాచ్. బెంగళూరుకు ఆరవ మ్యాచ్. ఇప్పటివరకు ముంబై ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకే ఒక్కటి గెలిచింది. బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్లలో ఒక దాంట్లో మాత్రమే గెలుపొందింది. పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉన్న ఈ జట్లకు గురువారం నాటి మ్యాచ్ అత్యంత కీలకం.
ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కింది. రోహిత్ శర్మ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 49 పరుగులు చేసి తన పూర్వపు ఫామ్ లోకి వచ్చాడు.. ఈశాన్ కిషన్ ధాటిగా ఆడుతున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే అవుటయి నిరాశపరచాడు. అతడి నుంచి ముంబై భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా బ్యాట్ తో మెరుస్తున్నప్పటికీ.. బౌలింగ్లో అతడు రాణించలేకపోతున్నాడు. తిలక్ వర్మ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 6 పరుగులకే అవుట్ అయ్యాడు. అతడి నుంచి కూడా ముంబై జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. టిమ్ డేవిడ్ టచ్ లోకి రావడం జట్టుకు శుభపరిణామం. ఆల్ రౌండర్ షెఫర్డ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వీరవిహారం చేయడం ముంబై జట్టుకు లాభించే అంశం.
ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించడం లేదు. ఆకాష్ మద్వాల్ దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. కొయేట్జీ పర్వాలేదనిపిస్తున్నాడు. పీయూష్ చావ్లా తన మ్యాజిక్ ప్రదర్శించలేకపోతున్నాడు. మహమ్మద్ నబీ ఇంతవరకు తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ వేయలేకపోయాడు. వీరందరూ రాణిస్తే ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు తిరుగుండదు.
ఇక బెంగళూరు జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడింది. పంజాబ్ జట్టుపై మాత్రమే విజయం సాధించింది. మిగతా అన్ని జట్లపై ఓటమిపాలైంది. భీకరమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయకపోవడంతో బెంగళూరు వరస ఓటములు ఎదుర్కొంటోంది. బ్యాటింగ్ విభాగంలో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బెంగళూరు పూర్తిగా డీలాపడుతోంది. లక్నో, కోల్ కతా, రాజస్థాన్, చెన్నై జట్లపై జరిగిన మ్యాచ్ లలో బెంగళూరు ఓటమిపాలైంది. 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై జట్టుతో తలపడి ఓడిపోయిన బెంగళూరు.. అదే స్థాయి వైఫల్యాలను కొనసాగిస్తోంది. గ్రీన్, డూ ప్లెసిస్, మాక్స్ వెల్ వంటి వారు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు.. దీంతో బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ ఒక్కడే మోస్తున్నాడు. ఫలితంగా అది జట్టు స్కోర్ పై ప్రభావం చూపిస్తోంది. ఒకవేళ జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్లు ప్రతిభ చూపడం లేదు.
ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఏకంగా 183 పరుగులు చేసింది.. అదేం తీసి పారేయదగ్గ స్కోర్ కాదు. కానీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు విఫలమయ్యారు. టోఫ్లీ ఒక్కడు మాత్రమే బౌలింగ్ పర్వాలేదనిపిస్తున్నాడు.. సిరాజ్ తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. యశ్ దయాళ్ అప్పుడప్పుడూ మెరుస్తున్నాడు. గ్రీన్, హిమాన్షు శర్మ వంటి వారు బౌలింగ్లో సత్తా చాటలేకపోతున్నారు. వీరందరూ కలిసికట్టుగా రాణిస్తే బెంగళూరుకు తిరుగు ఉండదు. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న ఈ జట్టు.. ముంబై తో జరిగే మ్యాచ్లో గెలిచి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తోంది.
జట్ల అంచనా ఇలా
ముంబై
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్, కిషన్, సూర్య కుమార్ యాదవ్, బ్రేవిస్, పీయూష్ చావ్లా, మహమ్మద్ నబి, షెపర్డ్, బుమ్రా, కొయేట్జీ, ఆకాష్ మద్వాల్.
బెంగళూరు
డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, యశ్ దయాళ్, టోఫ్లే, హిమాన్షు శర్మ, మహమ్మద్ సిరాజ్, మయాంక్ దగర్, కామెరూన్ గ్రీన్/ రజత్ పాటిదర్.