Kurnool: ఉగాది వేడుకల్లో అపశృతి. అప్పటివరకు ఆనందోత్సవాల మధ్య రథం లాగుతుండగా.. ఒక్కసారిగా పిల్లలు కుప్పకూలిపోయారు. విద్యుత్ వైర్లు తెగిపడడంతో.. విద్యుదాఘాతానికి గురై రథం నుంచి కిందకు పడిపోయారు 15 మంది పిల్లలు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కొందరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో జరిగింది ఈ ఘటన.
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో గురువారం ఉదయం ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ప్రభలు లాగుతుండగా.. పైన విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలు తెగిపడ్డాయి. దీంతో రథం పై ఉన్న 15మంది చిన్నారులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. రథం నుంచి కింద పడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తల్లిదండ్రుల ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. వెంటనే గాయపడిన చిన్నారులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కర్నూలు జిజిహెచ్ కు తరలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా రథం లాగడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరికి ప్రాణాపాయం లేదని తెలియడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో క్షతగాత్రులను పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామంలో ఏటా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది వచ్చిన మూడో రోజు ఇక్కడ రథోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా పక్కాగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే రథం లాగే క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఊహించని ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని.. భగవంతుడే మా పిల్లలను కాపాడాడంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నారు. అయితే భారీ ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకోవడం కనిపించింది.