MI Vs RCB IPL 2024: ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోకు ఇండియన్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కపిల్ శర్మ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. రోహిత్ గురించి చెప్పండి అని అడగగానే.. రెండవ మాటకు తావు లేకుండా మైదానంలో “నాటు” వ్యాఖ్యలు చేస్తుంటాడని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ షోలో నవ్వులు విరిసాయి. హాజరైన ప్రేక్షకులు అరిచి గోల చేశారు. అయ్యర్ చెప్పినట్టుగానే రోహిత్ తనలో మరోసారి “నాటు”తనాన్ని ప్రదర్శించాడు. గురువారం రాత్రి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. రోహిత్ లోని అసలు సిసలైన “నాటు”తనాన్ని బయటపెడుతున్నాయి.
గురువారం రాత్రి వాంఖడే మైదానంలో ముంబై, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్ లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఆకాష్ మద్వాల్ బౌలింగ్ లో దినేష్ కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 ఓవర్, చివరి ఓవర్ లో 19 చొప్పున పరుగులు పిండుకున్నాడు. ముఖ్యంగా 16 ఓవర్లో బ్యాట్ ను వంచి ఆడిన విధానం ఈ మ్యాచ్ కే హైలెట్. అలా ఆ ఓవర్ లో అతడు ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్ లో సిక్స్, ఫోర్లు బాదుతూ 19 పరుగులు సాధించాడు. ఫలితంగా బెంగళూరు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ 53 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు..
దినేష్ కార్తీక్ విధ్వంస ఇన్నింగ్స్ నేపథ్యంలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ స్పందించాడు. “కార్తీక్.. శభాష్ రా.. ప్రపంచ కప్ లో ఆడేందుకే కదా.. ఇలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నావ్” అని సరదాగా ఆటపట్టించాడు. అయితే రోహిత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. రోహిత్ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఈశాన్ కిషన్ ఉన్నాడు.. ఆ మాటలకు అతడు ముసిముసి నవ్వులు నవ్వాడు. రోహిత్ అనంతరం కామెంట్రీ చేసే వాళ్ళు కూడా “దినేష్ కార్తీక్ టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకునేందుకు ఆడుతున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. కాగా, ఈ మ్యాచ్ లో 196 పరుగులు చేసినప్పటికీ.. బెంగళూరు బౌలర్లు చేతులెత్తేయడంతో ముంబై ఘనవిజయం సాధించింది.
Full Video pic.twitter.com/PjOc0J7CRF
— Chetan Gawale (@pseudomudo) April 11, 2024