MI Vs LSG IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ ఊహించారు. పైగా ఇటీవల అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ముంబై జట్టుపై అదరగొడతాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను అతడు తలకిందులు చేశాడు. అందరి ఊహలను పాతాళంలో పడేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి.. అదే గొప్ప స్కోరు అనుకుని.. భారీగా పరుగులు చేశానని పెవిలియన్ చేరుకున్నాడు. ముంబై బౌలర్ విల్ జాక్స్ బౌలింగ్లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.. దీంతో నెట్టింట రిషబ్ పంత్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 27 కోట్ల ఆటగాడివి ఇలా ఎందుకు ఆడుతున్నావని నెటిజన్లు మండిపడుతున్నారు.. ఈ సీజన్లో రిషబ్ పంత్ తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.. ఇక మిగతా మ్యాచ్లలో 0, 15, 2, 2, 21, 3, 0, 4 పరుగులు చేయడం విశేషం.
Also Read: ఉన్నట్టుండి మాల్దీవులకు వెళ్లిన SRH జట్టు.. కారణం ఏమై ఉంటుంది?
ఎందుకు విఫలమవుతున్నాడు
గత సీజన్లో రిషబ్ పంత్ సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టుకు నాయకుడిగా వ్యవహరించిన అతడు.. మైదానంలో అదరగొట్టాడు. పరుగుల వరద పారించాడు. అతడి ఆట తీరు చూసి లక్నో జట్టు యాజమాన్యం భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్ కి వచ్చేసరికి అతని ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఏమాత్రం గొప్ప ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. బౌలర్లను ధైర్యంగా ప్రతిఘటించలేకపోతున్నాడు. గట్టి షాట్ లు కొట్టలేకపోతున్నాడు. ఏదో అనామక ఆటగాడిలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. అతడి దుస్థితి చూసి లక్నో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్నో జట్టు యాజమాని సంజీవ్ గోయంక ఒత్తిడి వల్లే అతడు ఇలా ఆడుతున్నాడని.. బ్యాటింగ్ పై మనసు లగ్నం చేయలేకపోతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ఇంత దారుణంగా ఆడితే జట్టు ఎలా ప్లే ఆఫ్ వెళ్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా పంత్ తన ఆట తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. “రిషబ్ పంత్ గొప్ప ఆటగాడు అనుకున్నాం. అదరగొట్టే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తాడని ఊహించాం.. కానీ అతను మాత్రం విఫలమవుతున్నాడు. ఎందుకు ఇలా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. అతని మీద ఉన్న అంచనాలు మొత్తం తలకిందులవుతున్నాయి. అసలు రిషబ్ పంత్ బ్యాటింగ్ మర్చిపోయాడా?” అని పంత్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిషబ్ పంత్ 0 పరుగులకు అవుట్ కావడంతో.. లక్నో జట్టు యజమాని అతడిని మందలిచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు జహీర్ ఖాన్ వల్ల అతడు ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినట్టు సమాచారం. అందువల్లే పంత్ విఫలమవుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: 9 మ్యాచ్ లలో 19 మందిని ఆడించాం.. ఇంకేం చేస్తాం?: ధోని నిస్సహాయత!