MI vs KKR : ఐపీఎల్ 18 వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో పాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అలానే అంటిపెట్టుకొని ఉంటే బాగుండేదని.. జట్టు విజయాల బాటలో నడిచేదని కోల్ కతా నైట్ రైడర్స్ అభిమానులు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అయితే ఆ తదుపరి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. 152 రన్స్ విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. మొత్తంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఇదే ఊపు ముంబై ఇండియన్స్ జట్టుపై కూడా కొనసాగించాలని కోల్ కతా జట్టు భావించింది.. అయితే సోమవారం ముంబై తో జరిగిన మ్యాచ్లో కోల్ కతా పప్పులు ఉడకలేదు.. వాంఖడే మైదానంలో ముంబై జట్టు బౌలర్లు కోల్ కతా బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
Also Read : ఓడిపోయినా సరే తగ్గేదేలే.. దంచి కొట్టుడే అంటున్న ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్
బౌలింగ్ ఎంచుకొని..
టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టు బౌలర్ అశ్విని కుమార్ (4/24) కళ్ళు చెదిరే విధంగా బంతులు వేయడంతో కోల్ కతా జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది..కోల్ కతా జట్టులో రఘు వంశి(26), రమణ్ దీప్ సింగ్ (22) టాప్ స్కోరర్లు గా నిలిచారు. కేవలం 116 పరుగులకే కుప్పకూలడం ద్వారా కోల్ కతా జట్టు అనేక చెత్త రికార్డులు నమోదు చేసింది.
ఆరుసార్లు ముంబై పై
సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్ ద్వారా 116 పరుగులకే కుప్పకూలడంతో కోల్ కతా జట్టు అనేక చత్త రికార్డులను నమోదు చేసింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు పదిసార్లు 120 కంటే తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే వీటిల్లో ఆరుసార్లు ముంబై ఇండియన్స్ పైనే కోల్ కతా జట్టు స్వల్ప పరుగులకు ఆల్ అవుట్ కావడం విశేషం. అశ్వని కుమార్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే(11), రింకు సింగ్(17), మనీష్ పాండే (19), రస్సెల్(5) వంటివారు పెవిలియన్ త్వరగా చేరుకోవాల్సి వచ్చింది.. దీంతో కోల్ కతా జట్టు 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రమణ్ దీప్ సింగ్(22), రఘు వంశి (26) ఆ మాత్రం పరుగులు చేయకపోతే కోల్ కతా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓపెనర్ సునీల్ నరైన్(0) బౌల్ట్ బౌలింగ్లో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఇక అప్పట్నుంచి చివరి వికెట్ వరకు ఏ దశలోనూ కోల్ కతా కోలుకోలేదు.. చివరికి 116 పరుగులకే కోల్ కతా కుప్ప కూలింది. అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ లో బ్యాటర్లే ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. తొలిసారిగా కోల్ కతా పై ముంబై ఇండియన్స్ బౌలర్లు ప్రతాపం చూపించారు.