Mayank Agarwal : అతడి వేగానికి మైదానమే కాదు.. సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతోంది..

ఇక ఈ పది రోజుల వ్యవధిలో మయాంక్ యాదవ్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లోనూ అదే ఘనతను పునరావృతం చేశాడు. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడంతో సీనియర్ ఆటగాళ్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. భారత పేసు గుర్రం బుమ్రా కు సరైన జోడి దొరికిందని కితాబిస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 9, 2024 8:14 pm

Mayank Yadav

Follow us on

Mayank Yadav : గోడకు కొట్టిన బంతిలా.. సంద్రం నుంచి ఎగిసి వచ్చిన అలలా.. మెరుపు వేగంలా.. బుల్లెట్ లాంటి దూకుడులా.. ఇంకా చాలా.. ఎన్ని ఉపోద్ఘాతాలు వాడినా అతడి బౌలింగ్ ధాటికి సరిపోవు. వేగంగా విసరడం మాత్రమే కాదు.. గురి చూసి వికెట్లను పడగొడుతున్నాడు. అదును చూసి ప్రత్యర్థి ఆటగాళ్లను దెబ్బ కొడుతున్నాడు. అతడు వేసే బంతుల వేగానికి ఫోర్లు, సిక్సర్లు కాదు కదా.. వికెట్ కాపాడుకుంటే చాలనే తీరుగా బ్యాటర్ల వ్యవహార శైలి ఉంది. వేగం మాత్రమే కాదు.. బంతులను విసరడంలోనూ లైన్ అండ్ లెంగ్త్ పాటిస్తున్నాడు. అలా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తుండడంతో వార్తల్లో వ్యక్తి అవ్వడమే కాదు.. ఐపీఎల్ 17వ సీజన్లో తిరుగులేని స్పీడ్ బౌలర్ గా అవతరించాడు. అన్నీ బాగుంటే వచ్చే టీ – 20 వరల్డ్ కప్ లో టీమిండియాలో స్థానం కూడా సంపాదించుకుంటాడు.

మైదానంలోనే కాదు..

ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. పది జట్లల్లో కొన్ని మినహా మిగతావన్నీ నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు మయాంక్ యాదవ్.. ఈ ఐపీఎల్ తాజా సంచలనం.. ఆడిన మూడు మ్యాచ్ లలోనే తనేంటో నిరూపించుకున్నాడు. వేగంతోపాటు అద్భుతమైన బౌలింగ్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు. లక్నో జట్టు సాధిస్తున్న విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైదానంలో తుఫాన్ వేగంతో పరిగెడుతూ ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టిస్తున్నాడు.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే అతడిని అనుసరించే వారి సంఖ్య.. మయాంక్ విసిరిన బాల్స్ కంటే డబుల్ స్పీడ్ తో పరిగెడుతోంది.

కేవలం కొద్ది రోజుల్లోనే..

గత నెల 30న మయాంక్ యాదవ్ ఐపిఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో ఇన్ స్టా గ్రామ్ లో అతడిని అనుసరించే వారి సంఖ్య 4,570 గా ఉండేది. ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్య 4.48 లక్షలకు పెరిగింది. ఈనెల రెండవ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో అతడిని అనుసరించే వారి సంఖ్య ఏకంగా 2.26 లక్షలకు పెరగడం విశేషం. ఇక ఈ పది రోజుల వ్యవధిలో మయాంక్ యాదవ్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లోనూ అదే ఘనతను పునరావృతం చేశాడు. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడంతో సీనియర్ ఆటగాళ్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. భారత పేసు గుర్రం బుమ్రా కు సరైన జోడి దొరికిందని కితాబిస్తున్నారు.