Medigadda Barrage : “ముఖ్యమంత్రికి ఏం తెలవదు? ప్రభుత్వానికి ఏమీ తెలవదు. కాళేశ్వరం గురించి ఈక తెల్వదు. తోక తెల్వదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన కృత్రిమ కరువు. మేముంటే నీళ్లు ఇచ్చే వాళ్ళం. బిడ్డా.. నీళ్లు ఇవ్వకపోతే 50,000 మంది రైతులతో మేమే వెళ్తాం. నీళ్లు తెచ్చుకుంటాం” ఇవీ ఇటీవల కరీంనగర్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అలా వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే మేడిగడ్డ మరింత కుంగిందన్న వార్తలు మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.
మరింత కుంగిపోయిందట
కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పియర్లు, ఏప్రన్ మరింత కుంగి పోయిందట. గత అక్టోబర్ నెలలో మేడిగడ్డ కుంగు బాటు వెలుగులోకి వచ్చింది.. ఏడో బ్లాక్ లోని 19, 20, 21 పియర్లు, వాటికి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేర కుంగిపోయింది.. ఇక తాజా పరిస్థితులను చూస్తే నాలుగు, ఐదు అడుగుల మేర కుంగిపోయినట్టు కనిపిస్తోందట. ముఖ్యంగా ఏడో బ్లాక్ పియర్లు రోజురోజుకు కుంగిపోతున్నాయి. ఫలితంగా బ్యారేజీ మరింత ప్రమాదం అంచనా నిలిచిందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్ వే లో నెర్రెలు మరింత విస్తృతమవుతున్నాయి. ఇటీవల జాతీయ అధికారులు పర్యటించి.. అక్కడ దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లారు. వారు వెళ్ళిన కొద్ది రోజులకే ఆ మూడు పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగిపోయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం, కేటీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు, ఏప్రన్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయింది. మార్చి 7న జాతీయ అధికారుల పరిశీలన సమయంలోనూ అదే తీరుగా కనిపించింది.
సరిగ్గా నెల తర్వాత పరిశీలిస్తే..
సరిగ్గా నెల తర్వాత పరిశీలిస్తే కుంగుబాటు మరింత తీవ్రంగా కనిపిస్తోంది. బ్యారేజ్ బే ఏరియాలో పగుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఏడో బ్లాక్ మొత్తం తొలగించి పునర్నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. అలా చేస్తేనే బ్యారేజ్ నిలబడుతుందని చెబుతున్నారు. ఇవే కాకుండా మరమ్మతుల కోసం నిపుణుల బృందం అప్పట్లో కొన్ని సూచనలు చేసింది. దీంతో నిర్మాణ సంస్థ బ్యారేజీకి పైభాగంలో వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా మట్టికట్ట వేసింది. దాని నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నీటి ఊటల వల్ల లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఆఫ్రాన్ మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది.
అంతర్గత పొరలు బలహీనంగా ఉన్నాయా?
ఏడో అప్రాన్ నిర్మించిన ప్రాంతంలో భూమి అంతర్గత పొరలు బలహీనంగా ఉన్నాయని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ లో భారీగా ఇసుక మేటలు వేయడం.. దాదాపు 250 మీటర్ల లోతు వరకు భూమి పొరలు బలహీనంగా ఉండడం వల్ల ఏప్రన్ల పై ఒత్తిడి పడుతోందని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భూ అంతర్గత పొరల్లో సర్దుబాటు జరిగి ఆ పిల్లర్లు క్రమంగా కుంగి పోతున్నాయని తెలుస్తోంది. దీనివల్ల క్రస్ట్ స్పిల్ వే వరకు ఆ ప్రభావం ఉంటుందని సమాచారం. ఈ కారణాలవల్లే క్రస్ట్ స్పిల్ వేలో పగలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకు విస్మరించినట్టు?
వాస్తవానికి బ్యారేజీ నిర్మాణ సమయంలో డ్రిల్లింగ్ చేస్తారని.. అప్పుడు భూ పొరల్లో ఉన్న బలహీనతలు అర్థమవుతాయని.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్ళో, నిర్మాణ సంస్థ బాధ్యత రాహిత్యమో తెలియదు గాని.. వాటిని పట్టించుకోకుండానే పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్రాంత ఇంజనీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఏప్రన్ల నిర్మాణం కోసం తవ్విన గోతులలో బొగ్గు బయటపడిందని ప్రచారం జరుగుతున్నది. ఆ విషయం బయటకు వస్తే నిర్మాణం ఆగిపోతుందని.. అందుకే మూడో కంటికి తెలియకుండా ఆ బొగ్గును మహారాష్ట్ర వైపు తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మేడిగడ్డకు సంబంధించి ఏడో పియర్ నుంచి మహారాష్ట్ర వైపు నిర్మించినవన్నీ ఇదే తీరుగా ఉన్నట్టు గమనించాలని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజ్ వద్ద పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని వారు చెబుతున్నారు.