RCB Vs SRH 2024: ఐపీఎల్ 17వ సీజన్లో వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది బెంగళూరు జట్టు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన డూ ప్లెసిస్ సేన కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరులో భీకరమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు విజయాలు సాధించలేకపోతోంది. ఇక ఈ జట్టులో ఆరు మ్యాచ్ ల్లో భాగస్వామిగా ఉన్న ప్రమాదకరమైన ఆల్ రౌండర్ మాక్స్ వెల్ వరుసగా విఫలమయ్యాడు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. మరీ దారుణంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ గా వెను దిరిగాడు. బ్యాట్ తో విఫలమైనప్పటికీ.. బంతితో కూడా సత్తా చాటలేకపోతున్నాడు. గురువారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్లో ఒకే ఒక ఓవర్ వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తుండగా బొటనవేలికి గాయం కావడంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. గాయం నేపథ్యంలో అతడు తదుపరి మ్యాచ్లు ఆడేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆల్ రౌండర్ తో భర్తీ చేయాలని బెంగళూరు యాజమాన్యం భావిస్తోంది.
బెంగళూరు జట్టు ఏప్రిల్ 15న హైదరాబాద్ తో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనుంది. మాక్స్ వెల్ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో విల్ జాక్స్ ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇతడిని 3.2 కోట్లకు బెంగళూరు జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. ఇతడు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ చూపాడు 150 మ్యాచులు ఆడి 30 యావరేజ్ తో 4000 కు పైగా పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ మాత్రమే కాదు తనదైన రోజున స్పిన్ బౌలింగ్ తో జాక్స్ అద్భుతాలు చేయగలడు. టి20 అంటే చాలు ఇతడు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాడు. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ నకు ఇతడిని ఇంగ్లాండ్ జట్టు ఎంపిక చేసింది. ఆల్ రౌండర్ గా బరిలోకి దిగిన మాక్స్ వెల్ ఆశించినంత స్థాయిలో ఆడక పోవడంతో బెంగళూరు యాజమాన్యం ఒకింత ఆగ్రహంతో ఉంది. ఎలాగూ అతడిని హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ కు దూరం పెట్టాలని భావించింది. కానీ ఈ లోగానే అతడు గాయపడటంతో.. అతడి స్థానంలో జాక్స్ ను ఆడించనుంది.
జాక్స్ జట్టులోకి వస్తే హైదరాబాద్ కు ఇబ్బంది తప్పదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ అయితే ఎలా బ్యాటింగ్ చేస్తాడో.. జాక్స్ కూడా అలానే తాండవం చేస్తాడని వారు చెబుతున్నారు. పైగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు వరస ఓటములు ఎదుర్కొంది. సొంత ప్రేక్షకులు బెంగళూరు జట్టు ఆట తీరుపై ఆగ్రహం గా ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. పైగా ఇప్పటికే ఐపీఎల్ ఫస్ట్ ఫేస్ దాదాపు పూర్తి కావస్తోంది. తదుపరి దశలో జట్టు స్థానాన్ని పరిపూర్ణంగా కాపాడుకోవాలంటే కచ్చితంగా బెంగళూరు గెలవాల్సి ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ బెంగళూరుకు జీవన్మరణ సమస్యగా మారనుంది.. అందుకే ఈ మ్యాచ్లో పలు కీలక మార్పులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సక్సెస్ ట్రాక్ రికార్డు బాగో లేకపోయినప్పటికీ.. హైదరాబాద్ జట్టుకు బెంగళూరు నుంచి ఒకింత ఇబ్బందేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.