Sayaji Shinde: ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రి పాలయ్యారు. గురువారం ఆయన ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్ర లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆయనకు యాంజియోప్లాస్టీ చేయాలని సూచించారట. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది.
ఆయన గురించి డాక్టర్లు మాట్లాడుతూ .. సాయాజీ షిండే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే పరీక్షలు చేసి యాంజియోగ్రఫీ చేయించాలని సూచించాము. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్ గుర్తించాము. ఇది ప్రమాదకరం కాబట్టి వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని డాక్టర్లు వెల్లడించారు.
త్వరలో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. విలక్షణ నటుడు సాయాజీ షిండే తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే. ఆయన పరభాషా నటుడు. అన్ని భాషల్లోనూ తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఆయన నటించారు. సాయాజీ షిండే ఎక్కువగా తెలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ ఠాగూర్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సాయాజీ షిండే విలన్ రోల్ చేశారు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు
ఆ తర్వాత గుడుంబా శంకర్, పోకిరి, అరుంధతి ,కృష్ణ , మిస్టర్ పర్ఫెక్ట్ , దుబాయ్ శీను, దూకుడు , బిజినెస్ మెన్,ఆట , అతడు , లక్ష్మి ఇలా పదుల సంఖ్యలో తెలుగు చిత్రాలు చేశారు. కేవలం విలన్ పాత్రలే కాకుండా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించారు సాయాజీ షిండే.