Anil Kumble Love Story: అలాంటిది ఈ క్రికెటర్ ఓ వివాహితను ప్రేమించాడు. ఆ ప్రేమను అక్కడితోనే ఆపకుండా పెళ్లి దాకా తీసుకెళ్లాడు. అప్పటికే జీవితంలో ఒకసారి మోసపోయిన ఆమె.. మరొకసారి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె మనసును ఆ క్రికెటర్ గెలుచుకున్నాడు.. ముందుగా ఆమెతో స్నేహాన్ని మొదలుపెట్టాడు. ఆ స్నేహాన్ని ప్రేమ దాకా తీసుకెళ్లాడు. ఆ ప్రేమలో నమ్మకాన్ని పెంచుకున్నాడు. దానిని పెళ్లి దాకా విస్తరించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అనేక మలుపులు తిరిగింది. చివరికి సుఖాంతమైనప్పటికీ.. అతని జీవితం సినిమా తరహాలోనే రకరకాల ట్విస్టులతో సాగింది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు.. అతడు ప్రేమించిన వివాహిత ఎవరు.. చివరికి ఏం జరిగింది.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..
లెగ్ స్పిన్ బౌలింగ్ తో ఒకప్పటి లెజెండ్రీ బౌలర్ గా పేరు పొందాడు అనిల్ కుంబ్లే. మైదానంలో తనకు మాత్రమే సాధ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. మైదానంలోనే కాదు.. జీవితంలో కూడా అత్యంత ఇన్స్పైరబుల్ పర్సనాలిటీ గా నిలిచాడు. అతని జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చాయి.. అనిల్ భార్య పేరు చేతన రామన్. వాస్తవానికి వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ఒక డెస్టిని అనాలేమో. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అయితే అప్పటికే చేతనకు వివాహం జరిగింది. భర్త ద్వారా ఒక కూతురు కూడా కలిగింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె విడాకులు ఇచ్చింది. మొదటి భర్త ద్వారా చేతనకు అరిణి అనే కుమార్తె ఉంది.. మొదట్లో చేతన తన కుమార్తె మీద చూపించే ప్రేమకు అనిల్ మురిసిపోయేవాడు. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షితుడయ్యేవాడు. అనిల్ చేతన మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రధాన కారణం కూడా అదే. ఇద్దరు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు అంగీకరించడం.. ఆ తర్వాత అనిల్, చేతన పెళ్లి చేసుకోవడం సులువుగానే జరిగిపోయాయి. 1999లో అనిల్, చేతన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. చేతన అయితే తన జీవితంలోకి వచ్చింది గానీ.. అనిల్ కోరుకున్నట్టుగా అరిణి వారి జీవితంలోకి ప్రవేశించలేకపోయింది. దీనికి కారణం చేతన మొదటి భర్త అడ్డుపడటమే. దీంతో అరిణి అనిల్ ఒక యుద్ధమే చేశాడు. ఆమెను తమ జీవితంలోకి ఆహ్వానించడానికి కోర్టుల చుట్టూ తిరిగాడు. కట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు.. చివరికి అనిల్ మాటలతో ఏకీభవించిన న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు
అరిణి బాధ్యతలు కోర్టు అప్పగించిన తర్వాత అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత అనిల్ చేతన దంపతులకు మయాస్, దియా అనే ఇద్దరు పిల్లలు కలిగారు.. ఇద్దరితో పాటు, అరిణి ని కూడా అనిల్ అత్యంత ప్రేమగా పెంచాడు. వారు ముగ్గురిని ఉన్నత చదువులు చదివించాడు. వారంతా కూడా వారి వారి రంగాలలో స్థిరపడ్డారు. అనిల్ ఆ ముగ్గురి మీద ఒకే రకమైన ప్రేమను చూపిస్తుంటాడు. ఒకే రకంగా చూసుకుంటాడు.. ప్రేమలోను రక్త బంధాన్ని.. వారసత్వాన్ని వెతుకుతున్న ఈ రోజుల్లో.. దాదాపు 26 సంవత్సరాల క్రితమే అనిల్ ఆ చాందస భావానికి అడ్డుకట్ట వేశాడు. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పరిపూర్ణమైన బంధం అని.. దానికి ఎటువంటి నేపథ్యాలతో సంబంధం లేదని నిరూపించాడు.