LSG vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాత్రి నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై లక్నో విజయం సాధించింది. ఈ సీజన్లో లక్నోకు ఇది మొదటి విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.. డికాక్(54), క్రునాల్ పాండ్యా (43), పూరన్(42) దూకుడుగా ఆడారు. ముఖ్యంగా పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
అనంతరం చేజింగ్ కు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి 21 రన్స్ తేడాతో ఓటమిపాలైంది..ధావన్(70), బెయిర్ స్టో(42), పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ బుల్లెట్ల లాంటి బంతులు విసరడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అతడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడంతో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 27 పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు నేలకూల్చాడు.
మ్యాచ్ అనంతరం పంజాబీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. “పంజాబ్ ఆటగాడు లివింగ్ స్టోన్ గాయపడ్డాడు. మాయాంక్ యాదవ్ క్రమశిక్షణ తో బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ వల్లే మా జట్టు ఓడిపోయింది. పంజాబ్ జట్టు కొంపను కూల్చాడు.. లక్నో టీం చివరి ఓవర్లలో అద్భుతంగా ఆడింది. లివింగ్ స్టోన్ కు గాయం కావడం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అతడు నాలుగో స్థానంలో వచ్చి ఉండాల్సింది. కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ మేము గొప్పగా బ్యాటింగ్ ప్రారంభించాం. కానీ మయాంక్ తన బౌలింగ్ తో మ్యాచ్ ను లక్నో చేతుల్లోకి తీసుకెళ్లాడు. 21 ఏళ్ల ఆ యువకుడి బౌలింగ్ వేగం నాకు బాగా నచ్చింది. యార్కర్లు, డాట్ బాల్స్ వేస్తూ సింగిల్స్ కు మాత్రమే పరిమితమయ్యేలా చేశాడు. పేస్ ను ఉపయోగించుకునే మైదానంలో బౌండరీలు సాధించాలని బ్యాటర్లకు చెప్పాను. కానీ మాయాంక్ బెయిర్ స్టో దేహానికి బంతిని విసిరి వికెట్ పడగొట్టాడు. మయాంక్ ను వదిలిపెట్టి ఇతర బౌలర్లపై దృష్టి సారించాలని జితేష్ శర్మతో వ్యాఖ్యానించాను. కానీ మిగతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. క్యాచ్ లను చేజార్చుకోవడం వల్ల మ్యాచ్ కోల్పోయాం. ఫీల్డింగ్ విషయంలో మేము మరింత పరిణితి సాధించాలి. విజయానికి దగ్గరగా వచ్చామనే భావన ఉంది. ఆట తీరు మరింత మెరుగుపరచుకోవాల్సి ఉందని” ధావన్ పేర్కొన్నాడు.