LSG Vs GT: లక్నో గెలుపులో ఎన్ని మలుపులో.. గిల్ కు మామూలు షాక్ కాదు

మైదానంపై కాస్త తేమ ఉన్నట్టు కనిపించడంతో లక్నో కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

Written By: Dharma, Updated On : April 8, 2024 8:53 am

LSG Vs GT

Follow us on

LSG Vs GT: వేగమే కొలమానంగా.. దూకుడే సిసలైన మంత్రంగా… బాదుడే అసలైన తంత్రంగా సాగే టీ -20 లో 163 పరుగులు పెద్ద లక్ష్యం కాదు. పైగా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకు అసలు అది పెద్ద కష్టం కాదు. కానీ ఆ 163 పరుగులు గుజరాత్ జట్టుకు కొండంత లక్ష్యం లాగా కనిపించింది. దానికి తోడు లక్నో బౌలింగ్ చుక్కలు చూపించింది. ఫలితంగా సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా చేజార్చుకుంది. వరుసగా మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.. ఈ విజయంతో లక్నో పాయింట్లు పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది..

దురదృష్టం వెంటాడింది

మైదానంపై కాస్త తేమ ఉన్నట్టు కనిపించడంతో లక్నో కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. స్టోయినిస్(43 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో 58), కేఎల్ రాహుల్ (31 బంతుల్లో మూడు ఫోర్లతో 33), నికోలస్ పూరన్(22 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 32 నాటౌట్) ఆయుష్ బదోని(11 బంతుల్లో మూడు ఫోర్లతో 20 నాటౌట్) ఆకట్టుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ..

లక్ష్య చేదనలో గుజరాత్ జట్టు 130 పరుగులకే కుప్ప కూలింది. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్(5/30), కృనాల్ పాండ్యా (3/11) మెరుపు బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు కకావికలమైంది.. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (23 బంతుల్లో నాలుగు ఫోర్ లతో 31) మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మ్యాచ్ చివర్లో రాహుల్ తేవాటియా(30) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్లు అద్భుతాలు చేశారు.. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గిల్ తొలి వికెట్ కు 54 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ..గిల్ క్లీన్ బౌల్డ్ కావడం, కేన్ విలియంసన్ రవి బిష్ణోయ్ అదిరిపోయే క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఇక నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్, ఆరంగేట్ర ఆటగాడు బీఆర్ శరత్ ను కృనాల్ పాండ్యా ఒకే ఓవర్ లో అవుట్ చేసి..మ్యాచ్ ను లక్నో చేతుల్లోకి తెచ్చాడు.. జట్టు విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో.. విజయ్ శంకర్ (12), దర్శన్ నల్కండే (12) దారుణ ఆట తీరు ప్రదర్శించారు. రషీద్ ఖాన్ (0) విఫలమయ్యాడు.. ఉమేష్ యాదవ్ చేతులెత్తేశాడు. ఫలితంగా గుజరాత్ అప్పటికే ఓటమిని ఖరారు చేసుకుంది. రాహుల్ తేవాటియా చివర్లో దూకుడుగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా లక్నో జట్టు మూడవ స్థానానికి ఎగబాకింది.. వాస్తవానికి స్వల్ప స్కోర్ కావడంతో ఈ మ్యాచ్ గెలుస్తామని గిల్ భావించాడు. కానీ అనూహ్యంగా జట్టు 130 పరుగులకే కుప్పకూలడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం.. ఓటమికి సంబంధించిన విశ్లేషణలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.