LSG Vs GT 2025: ఇక లక్నో జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడి.. నాలుగు విజయాలు సాధించింది. ఇందులో ప్రతి మ్యాచ్ లోనూ ఒక్కో ఆటగాడు లక్నో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో లక్నో తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. లక్నో సాధించిన విజయంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ఇతడు 4 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ ను లక్నో బౌలర్ దిగ్వేష్ రాటి అవుట్ చేయడంతో.. మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. లక్నో విజయం సాధించింది. ఈ క్రమంలో ఒకే ఒక్క వికెట్ తీసినప్పటికీ దిగ్వేష్ రాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో లక్నో నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఆటగాడు నికోలస్ పూరన్(87) ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టులో ఓపెనర్ మార్క్రం (58) స్ఫూర్తి దాయకమైన ఇన్నింగ్ ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా లక్నో జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన లక్నో.. నాలుగు విజయాలను సాధించింది.
Also Read: సన్ రైజర్స్ ఆట పంజాబ్ ఆడుతోంది.. ఈ మ్యాచ్ పోతే గోవిందా
పంత్ విఫలమవుతున్నాడు
లక్నో జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు తనది అని చెప్పుకునే స్థాయిలో ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. గత సీజన్లో ఢిల్లీ జట్టు తరఫున ఆడిన అతడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. కానీ ఈ సీజన్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు లక్నో జట్టు ఆడిన ఆరు మ్యాచులలో.. రిషబ్ పంత్ ఐదుసార్లు బ్యాటింగ్ చేశాడు. ఇక శనివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి వచ్చాడు. నాలుగు ఫ్లోర్లు కొట్టి సౌకర్యవంతంగానే కనిపించినప్పటికీ.. చివరికి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.. కెప్టెన్ గా రిషబ్ పంత్ పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. తదుపరి మ్యాచ్ లో నైనా రిషబ్ పంత్ మెరుగ్గా ఆడాలని లక్నో జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.