
IPL Phase II – 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 కు కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇండియాలో నిర్వహించిన టోర్నీ.. కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐకి కోట్లల్లో నష్టం వచ్చింది. ఇటు ప్రాంచైజీలకూ, అటు ఆటగాళ్లకూ తిప్పలు తప్పలేదు. సొంత దేశానికి వెళ్లడానికి విదేశీ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా.. సగంలోనే టోర్నీని ముగించాల్సి వచ్చింది. మిగిలిన సగం త్వరలో ప్రారంభం కాబోతోంది. దుబాయ్ ను వేదికగా ఎంచుకున్న బీసీసీఐ.. సెప్టెంబర్ లో మిగిలిన మ్యాచులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ పోటీలను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 19 నుంచి పోటీలు మొదలు కానున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. లీగ్ పోటీలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 10న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ అక్టోబర్ 11న జరుగుతుంది. రెండో క్వాలిఫయర్ అక్టోబర్ 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న నిర్వహిస్తారు.
అయితే.. ఈ రెండో దశలో పలువురు స్టార్ ప్లేయర్స్ పాల్గొనట్లేదు. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుందా? ధనాధన్ బ్యాటింగ్ ఎప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించేదే. దుబాయ్ లో కరోనా భయం లేకపోయినప్పటికీ.. షెడ్యూల్ సమస్య వచ్చి పడింది. ఐపీఎల్ వాయిదా పడడంతో.. ముందస్తుగా షెడ్యూల్స్ నిర్ణయించిన అంతర్జాతీయ మ్యాచ్ లకు వారు హాజరు కావాల్సి ఉంది. దీంతో.. అనివార్యంగా వారు ఐపీఎల్ ను వీడాల్సి వస్తోంది. మరి, వారిలో ఎవరెవరు ఉన్నారు అన్నది చూద్దాం.
ఐపీఎల్ సెంకడ్ ఫేజ్ కు దూరమవుతున్న విదేశీ ఆటగాళ్లలో.. స్టీవ్ స్మిత్(ఢిల్లీ క్యాపిటల్స్), జాయ్‌రిచర్డ్ సన్(పంజాబ్‌కింగ్స్), రిలే మెరెడిత్(పంజాబ్ కింగ్స్), ఆడమ్ జాంపా (బెంగళూరు), పాట్ కమిన్స్ (కోల్ కతా), బెన్ స్టోక్స్ (రాజస్థాన్), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జోస్ బట్లర్ (రాజస్థాన్) ఈ ఆటగాళ్లంతా దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ పోటీలకు దూరం కాబోతున్నారు.
కాగా.. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. కరోనా పూర్తిస్థాయిలో అంతం కాకపోవడంతో.. మళ్లీ ఏదైనా ఇబ్బంది వస్తుందా? అని ఆలోచనలు చేస్తున్నారు. అయితే.. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ అంశం చర్చల్లో ఉందని తెలిపారు. యూఏఈ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. దీంతో.. నిర్ణయం వారి చేతుల్లోనే ఉందన్నమాట.