IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు లీగ్ మ్యాచ్ ల కోసం సిద్ధమవుతున్నాయి. నిర్వాహకులు కూడా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల కావడంతో అభిమానులు తమకు ఇష్టమైన జట్లపై అంచనాలు భారీగా పెంచుకున్నారు. వాస్తవానికి ఐపీఎల్ అంటేనే దూకుడుకు మారుపేరు. మరి అలాంటి ఐపీఎల్ లో ఇప్పటివరకు జరిగిన సీజన్లలో దూకుడుగా బ్యాటింగ్ చేసి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
రాబిన్ ఊతప్ప, 2008
2008లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో కోల్ కతా ఆటగాడు రాబిన్ ఊతప్ప బ్యాట్ తో వీర విహారం చేశాడు. ఆ సీజన్ లో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ 2015లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. ఆ సీజన్లో అతడు ఏకంగా 562 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 2016లో బెంగళూరు జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 973 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
డేవిడ్ వార్నర్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడిగా డేవిడ్ వార్నర్ 2017లో 641 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 2015 లో కూడా వార్నర్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
కేన్ విలియం సన్
హైదరాబాద్ జట్టు తరఫున విలియంసన్ 2018 సీజన్లో ఏకంగా 735 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
డేవిడ్ వార్నర్
హైదరాబాద్ జట్టు తరఫున డేవిడ్ వార్నర్ 2019 సీజన్లో 692 పరుగులు సాధించాడు. బ్యాట్ తో వీర విహారం చేశాడు. ఏకంగా మూడవసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
కేల్ రాహుల్
బెంగళూరు జట్టు ఆటగాడిగా కె.ఎల్ రాహుల్ 2020 సీజన్లో దూకుడుగా ఆడాడు. ఏకంగా 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్
చెన్నై జట్టు తరఫున ఆడిన ఈ యువ సంచలనం 2021 సీజన్లో దుమ్ము దులిపాడు. 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ధరించాడు.
జోస్ బట్లర్
ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున 2022 సీజన్లో తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సగర్వంగా అందుకున్నాడు.
గిల్
గుజరాత్ టైటాన్స్ జట్టు తరుపున టీమిండియా యంగ్ వండర్ శుభ్ మన్ గిల్ 2023 సీజన్ కు సంబంధించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.