
IPL2023 Mumbai Vs RCB: ఆకలిగా ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుంది? నిచ్చలంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా సునామితో విరుచుకు పడితే ఎలా ఉంటుంది? అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పొంగే లావా ఎంత వేడిగా ఉంటుంది? తుఫాన్ ఏర్పడినప్పుడు హోరు గాలి వేగం ఏ స్థాయిలో ఉంటుంది? ఇన్ని ఉపమానాలు కూడా సరిపోవేమో.. తెలుగు భాషలో కొత్త వాటిని వెతుక్కోవాలేమో.. ఏం ఇన్నింగ్స్.. ఏం ఆట.. చాలా మందికి వయసు మీద పడుతున్నా కొద్దీ… ఆటతీరులో తేడా వస్తుంది. అదేంటో కానీ విరాట్ కోహ్లీకి మరింత ఊపు వస్తున్నట్టు కనిపిస్తోంది. లేకుంటే 171 పరుగుల విజయ లక్ష్యాన్ని జస్ట్ గాలిలా ఊది పారేశాడు.. బంతుల్ని ఊచ కోత కోశాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు.. సొంత మైదానంలో రోహిత్ సేనకు విరాటపర్వాన్ని 70 ఎంఎం స్క్రీన్ లో చూపించాడు.
ఆదివారం బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ (46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో 84 నాట్ అవుట్) అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. నేహాల్ వాదేర (13 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్ లతో 21) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, టోప్లి, ఆకాష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మైకేల్ బ్రేస్ వెల్ తలా ఒక వికెట్ తీశారు.

ఇక 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు కింగ్ కోహ్లీ మెరుపులాంటి ఆరంభం ఇచ్చాడు. జస్ట్ 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 172 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకునేలా చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, మరో ఓపెనర్ డూప్లేసిస్ తో కలిసి తొలి వికెట్ కు 148 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యాన్ని అర్షద్ ఖాన్ విడదీశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన దినేష్ కార్తీక్ డక్ అవుట్ అయ్యాడు. మాక్స్ వెల్(3 బంతుల్లో 2 సిక్స్ లతో 12 నాట్ అవుట్) సాయంతో కింగ్ కోహ్లీ లాంచనాన్ని పూర్తి చేశాడు. భారీ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించడం ఇక్కడ విశేషం.
ఇన్నింగ్స్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను జోఫ్రా ఆర్చర్ నేలపాలు చేయడం ముంబై జట్టు కొంపముంచింది. అది పట్టి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ముంబై ఇండియన్స్ జట్టు ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. తిలక్ వర్మ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ముంబై సాధారణ స్కోరుకే పరిమితం కావలసి వచ్చింది. బెంగళూరు లాంటి మైదానంలో 200 పైచిలుకు పరుగులు తీసినా… దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమే. మరో వైపు 2013 నుంచి ఇప్పటివరకు ముంబై తన తొలి మ్యాచ్ ను గెలవలేక పోతోంది.
ఇక విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్
పేలిపోతున్నాయి..”రోహిత్.. ఇదీ వీర విరాటం అంటే.. సమజ్ అయిందా?” అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో “అతడు ఒక అగ్నికణం.. దూరంగా జరగండి.. లేకుంటే దహించి వేస్తాడు” అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేస్తున్నారు.. విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక కన్నడ ప్రజ పండగ చేసుకుంటున్నది.
Ball by ball highlights of Virat Kohli’s 82*(49) vs MI, IPL 2023pic.twitter.com/x9nnGqiya3
— RCB BOX (@_ratna_deep) April 2, 2023