
SRH Vs RR IPL2023: సొంత మైదానంలో ఆడి గుజరాత్ గెలిచింది. బెంగళూరు విజయ దుందుభి మోగించింది. కానీ అదే హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.. ఓడిపోయింది అనేకంటే చేజేతులా ఓటమి కొని తెచ్చుకుంది అనడం సబబు. ఈ వైఫల్యానికి భువనేశ్వర్ కుమార్ ప్రధాన కారణం..
నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డపై ఆడుతోంది.. సొంత ప్రేక్షకుల మద్దతు ఉంది.. మైదానం చూస్తే బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది.. తేమ కూడా కనిపిస్తోంది.. ఇలాంటి అప్పుడు టాస్ గెలిచిన కెప్టెన్ మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటాడు. కానీ అదేం దురదృష్టమో కానీ కావ్య పాప జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.. పోనీ బౌలింగ్ అయినా మెరుగ్గా ఉందా అంటే అదీ లేదు.. ఏదో గల్లి స్థాయిలో వేసినట్టు బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్థాన్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు.. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 9 ఫోర్లతో 54), జోస్ బట్లర్(22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 54), సంజూ శాంసన్ ( 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ (2/23) మాత్రమే రాణించాడు. ఫజలక్ ఫరూఖీ(2/41), ఉమ్రాన్ మాలిక్ (1/32) వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
లక్ష చేదనకు దిగిన హైదరాబాద్ జట్టు ఏ దశలోను ప్రభావం చూపలేకపోయింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్ (27), ఇంపాక్ట్ ప్లేయర్ సమద్(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు.. అసలు తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి డక్ ఔట్ అయ్యారు. బ్రూక్(13), వాషింగ్టన్ సుందర్ (1), ఫిలిప్స్(8), రశీద్(18), భువనేశ్వర్ కుమార్ (6) తీవ్రంగా నిరాశపరిచారు.. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(4/17) నాలుగు వికెట్లు తీశాడు. ట్రెంట్ రెండు, హోల్డర్, అశ్విన్ చేరో ఒక వికెట్ తీశారు.

వాస్తవానికి ఈ మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎంచుకోవడం హైదరాబాద్ జట్టు కొంప ముంచింది. పైగా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్ లో ఇద్దరు హైదరాబాద్ బ్యాటర్లు డక్ అవుట్ గా వెను తిరిగారంటే వారి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు బ్యాటర్లు త్వర త్వరగా అవుట్ కావడంతో మిగతావారు ఒత్తిడికి గురయ్యారు. చేజేతులా రాజస్థాన్ జట్టుకు మ్యాచ్ అప్పగించారు. నాలుగు సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై ఆడుతున్న తరుణంలో తమ జట్టు గెలుస్తుందని హైదరాబాద్ వాసులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలను భువనేశ్వర్ కుమార్ ఆడియాసలు చేశాడు. మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో నెటిజన్లు భువనేశ్వర్ కుమార్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు..” బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న మైదానంపై బౌలింగ్ ఎంచుకుంటావా అని” ట్రోల్ చేస్తున్నారు. “ఇదేం కెప్టెన్సీ భువి నీకు అర్థం అవుతుందా” అంటూ చురకలు అంటిస్తున్నారు.
⚡️⚡️ Trent-ing in Hyderabad!pic.twitter.com/FVa7owLQnL
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023