
Sai Dharam Tej: చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ పునర్జన్మ ఎత్తారు. 2021 సెప్టెంబర్ లో ఆయన బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి అంబులెన్సుకి ఫోన్ చేశారు. దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కుటుంబ సభ్యులు చేరుకున్న అనంతరం ఆయన్ని మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. చాలా కాలం సాయి ధరమ్ తేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్ని నెలల తర్వాత మెగా ఫ్యామిలీ ఆయన్ని మరలా ప్రపంచానికి పరిచయం చేసింది. కేక్ కట్ చేయించి గ్రాండ్ వెల్కం చెప్పారు.
ఈ ప్రమాదం జరిగింది ఏడాదిన్నర అవుతుండగా సాయి ధరమ్ తేజ్ ఓపెన్ అయ్యారు. ఫస్ట్ టైం అప్పటి కఠిన పరిస్థితులు అభిమానులతో పంచుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టిందట. ఆ సమయంలో మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యారట. కొంచెం కోలుకున్నాక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే… దారుణమైన కామెంట్స్ కనిపించాయట. ఏంటి మీరు సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకున్నారా? మీ పని అయిపోయిందా? అంటూ కామెంట్స్ చేశారట. అవి తనను బాధపెట్టాయట.
నేను కావాలని తీసుకున్న విరామం కాదు కదా అని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. దారుణమైన విషయం ఏమిటంటే, సాయి ధరమ్ తేజ్ కి మాట పడిపోయిందట. ఎప్పుడూ గలగలా మాట్లాడే సాయి ధరమ్ రెండు మూడు పదాలు పలకలేని స్థితికి వెళ్ళిపోయాడట. తాను మాట్లాడుతుంటే ఎదుటి వాళ్లకు అర్థమయ్యేది కాదట. తాగి మాట్లాడుతున్నావా? అని ఎగతాళి చేసేవారట. రిపబ్లిక్ మూవీ కోసం నాలుగు పేజీల డైలాగ్స్ అవలీలగా చెప్పిన నాకు నాలుగు మాటలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

పేరెంట్స్, సన్నిహితుల మద్దతుతో తిరిగి మాట్లాడగలుగుతున్నానని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఆ సమయంలో మాట విలువ తనకు తెలిసొచ్చిందట. సాయి ధరమ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్నారు. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.