Sanjay Manjrekar: విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మైదానాలపై అద్భుతమైన రికార్డు ఉంది. గత కొంతకాలంగా అతడు సరైన క్రికెట్ ఆడకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా అంటే విరాట్ రెచ్చిపోతాడు.. అయితే ఈసారి విరాట్ ను తమ ఉచ్చులో బంధించడానికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వెల్లడించాడు. ” బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో విరాట్ ఆడుతున్నాడు. అతడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో.. వచ్చే సిరీస్ లో కనిపించే అవకాశం లేదు. కోహ్లీ గతంలో మాదిరిగా దృఢంగా లేడు. గత ఐదు సంవత్సరాలలో అతడు రెండు సెంచరీలు మాత్రమే చేసాడు. తన చివరి 10 ఇన్నింగ్స్ లలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. పైగా అతడి సగటు 24 కంటే కాస్త ఎక్కువగా ఉంది.. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతులను ఆడలేక పోయాడు. అందువల్లే విఫలమయ్యాడు. ఇప్పుడు అదే విధానాన్ని ఆస్ట్రేలియా బౌలర్లు కూడా అవలంబించే అవకాశం ఉంది. అతడు ముందుకు వచ్చి ఆడే అవకాశం ఉన్నందువల్ల విరాట్ శరీరమే లక్ష్యంగా చేసుకొని బంతులు విసిరే అవకాశం ఉందని” సంజయ్ అభిప్రాయపడ్డాడు.. కాగా, విరాట్ గత అరవై టెస్ట్ ఇన్నింగ్స్ లలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2024లో ఇప్పటివరకు కోహ్లీ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతడి సగటు 22.72 గా ఉండటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.
విరాట్ ప్లాన్ రూపొందించుకోవాలి
ఆప్ స్టంప్ అవతల పడిన బంతులను ఆడ లేక అవుట్ అవుతున్న తీరును విరాట్ కోహ్లీ పున: సమీక్షించుకోవాలని సంజయ్ అభిప్రాయపడ్డాడు..”జోష్ హేజిల్ వుడ్, వెర్నాన్ ఫిలాండర్ మిడిల్ స్టంప్ లక్ష్యంగా బంతులు వేస్తారు. అలాంటప్పుడు విరాట్ మరింత సమర్థవంతంగా ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ జట్టుపై చూపించిన నిర్లక్ష్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది. అయితే విరాట్ దీని గురించి తెలియని అమాయకుడు అని నేను అనుకోను. అతడికి అన్నీ తెలుసు. విరాట్ విధ్వంసకరమైన ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. తనదైన రోజు ఎలాగైనా ఆడతాడు. ఆరోజు వచ్చిన నాడు అతడిని ఎవరూ అడ్డుకోలేరు. అతడు గొప్ప ఆటగాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మధ్యలో కాస్త వెనుకబడ్డాడు. అతడు గనుక తన పూర్వపు లయను అందుకుంటే సింహం జూలు విధిల్చినట్టే ఉంటుందని” సంజయ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కెర్రీ ఓకిఫ్ కూడా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందించాడు. ” అతడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. ఇటీవల కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. అలాగని ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతడిని రెచ్చగొడితే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. అతడు సింహం లాంటివాడు, ఎలాంటి రోజైనా వేటాడుతాడు. అందువల్ల ఆస్ట్రేలియా బౌలర్లు అతడిని గెలకకుండా ఉంటేనే మంచిదని” ఓకిఫ్ అభిప్రాయపడ్డాడు.