తొలి టెస్టులో గెలుపు జెండా ఎగరేయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. వర్షం ముంచేసింది. ఆ విధంగా మొదటి మ్యాచ్ డ్రా లిస్టులోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం రెండో టెస్టు కొనసాగుతోంది. తొలి రోజు భారత బ్యాటింగ్ చూసిన వారెవరైనా.. భారీ స్కోరు ఖాయమనే అనుకున్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదరగొట్టడంతో.. 500 పరుగులు సాధించినా ఆశ్చర్యం లేదని అనిపించింది. కానీ.. రెండో రోజు ఆట మొదలుకాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం 86 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయి 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది భారత్. ఈ క్రమంలోనే తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు కేఎల్ రాహుల్.
ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ గ్రౌండ్ లో రెండో టెస్టు కొనసాగుతోంది. ఒకటిన్నర రోజులో భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగియడంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షం రాకపోతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్ రూట్ 48 పరుగులతో, బెయిర్‌స్టో 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసిన తర్వాత ఫస్ట్ డే హీరో కేఎల్ రాహుల్.. టీమిండియా ఆటతీరుపై స్పందించాడు.
తొలి రోజు మంచి ఆరంభం లభించినందున.. మరిన్ని జరుగులు చేసి, జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపితే బాగుండేదని అన్నాడు. ఇందుకోసం తాను ప్రణాళికలు కూడా వేసుకున్నట్టు చెప్పాడు. అయితే.. ఊహించని రీతిలో రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత రాబిన్సన్ వేసిన రెండో బంతికి పెవిలియన్ చేరాడు. హాఫ్ వ్యాలీని కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి, స్లిప్ లో చిక్కాడు. ఆ విధంగా కేవలం.. రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుతిరిగాడు. ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ సైకిల్ స్టాండ్ ను తలపించింది.
దీనిపై రాహుల్ స్పందిస్తూ.. క్రీజులో పాతుకుపోయిన తర్వాత ఔటైతే తనకు చిరాగ్గా ఉంటుందని అన్నాడు. రెండో రోజు తమకు అత్యంత కీలకమైందని, తొలి సెషన్లో 70 నుంచి 80 పరుగులు సాధించాలని ప్లాన్ వేసుకున్నట్టు తెలిపాడు. అయితే.. టెంప్ట్ చేస్తూ వచ్చిన హాఫ్ వ్యాలీకి ఔటనందుకు ఫ్రస్ట్రేషన్ కు గురైనట్టు చెప్పాడు.
ఇక, అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా ఫామ్ కోసం తంటాలు పడుతుండడంపైనా రాహుల్ స్పందించాడు. జట్టు ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు పుజారా, రహానే ఆదుకున్నారని గుర్తు చేశాడు. వారు వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు అని చెప్పిన రాహుల్.. వారు తిరిగి ఫామ్ లోకి రావడానికి రెండు మూడు ఇన్నింగ్సులు సరిపోతాయని అన్నాడు. మూడో రోజు ఇంగ్లండ్ ను కట్టడి చేసేందుకు తమవద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. మరి, ఈ రోజు ఆటలో ఎవరు పైచేయి సాధిస్తారనేదాన్నిబట్టి ఒక అంచనాకు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.