KL Rahul 11th Test century: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది సంవత్సరాలు.. దాదాపు 3,211 రోజులు.. ఇంతకాలం పట్టింది అతడు సెంచరీ చేయడానికి. సెంచరీ చేసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశాడు. తాను ఎలాంటి ఆటగాడినో మరోసారి నిరూపించుకున్నాడు.. దాదాపు 2016 తర్వాత మళ్లీ ఇప్పుడు అతడు సెంచరీ చేశాడు.
మన దేశం వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం నుంచి నిర్వహిస్తున్నారు. వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి 162 పరుగులకు కుప్ప కూలింది. మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు వికెట్ల సొంతం చేసుకున్నాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. 32 పరుగులతో జస్టిన్ గ్రేవ్స్ వెస్టిండీస్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఈ కథనం రాసే సమయం వరకు నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ (36), కేల్ రాహుల్ (100) సత్తా చాటారు. సాయి సుదర్శన్ (7) విఫలమయ్యాడు. కెప్టెన్ గిల్(50) పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం క్రీజ్ లో జూరెల్(36), రవీంద్ర జడేజా (26) ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఐదవ వికెట్ కు ఇప్పటివరకు 48 పరుగులు జోడించారు.. అయితే రెండో రోజు ఆటలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేఎల్ రాహుల్ గురించి. ఎందుకంటే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్తో అతడు ఆకట్టుకున్నాడు. ఏకంగా సెంచరీ చేసి అదరగొట్టాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత అతడు సెంచరీ చేయడం టీమ్ ఇండియా ఆటగాళ్లకే కాదు.. అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగించింది.
స్వదేశంలో కేఎల్ రాహుల్ కు ఇది రెండవ టెస్టు సెంచరీ. 2016లో ఇంగ్లాండ్ జట్టుపై మొదటి టెస్టు సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. ఇటీవల ఇంగ్లాండు జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోను అతడు సెంచరీల మోత మోగించాడు. స్వదేశం వేదికగా తొమ్మిది సంవత్సరాల తర్వాత టెస్ట్ సెంచరీ సాధించడంతో కేఎల్ రాహుల్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అయితే ఇటీవల జరిగిన ఆసియా కప్ కు కె.ఎల్ రాహుల్ ను మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. దీంతో అతడి అభిమానులు గంభీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ అదరగొట్టడంతో అతడి అభిమానులు గంభీర్ ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా కేఎల్ రాహుల్ ఆట తీరును గుర్తించాలని సూచిస్తున్నారు.