KL Rahul: శనివారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్( CSK vs DC) పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లు కోల్పోయి.. 183 రన్స్ చేసింది. ఢిల్లీ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77: 51 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లు) తో దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో ఆఫ్ సైన్స్ చేసిన అతడు.. తదుపరి 27 పరుగులను 18 బంతుల్లో పూర్తి చేశాడు. సెంచరీ వైపు వెళ్తున్న అతడిని మతిష పతిరణ అద్భుతమైన బంతివేసి అవుట్ చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ ప్రస్థానం 77 పరుగుల వద్ద ఆగిపోయింది. వాస్తవానికి చెన్నై పిచ్ పై అంతటి స్కోర్ చేశాడంటే మామూలు విషయం కాదు. దూసుకు వస్తున్న బంతులను తెలివిగా పసిగట్టి.. పరుగులు రాబట్టాడు కేఎల్ రాహుల్. అతడి దూకుడు వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ ఆ స్థాయిలో స్కోర్ చేయగలిగింది. చెన్నై బౌలర్లు విజృంభిస్తున్న వేళ అతడు ఆడిన తీరు జట్టుకు కొండంత బలం లాగా మారింది. అతడు గనుక నిలబడకపోయి ఉంటే.. మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. అతడు నిలబడ్డాడు కాబట్టి.. మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: అనుకున్నదే జరిగింది.. చెన్నై హ్యాట్రిక్.. ఢిల్లీ టాప్..
సంజీవ్ సార్.. ఇప్పటికైనా తెలిసిందా
గత సీజన్లో లక్నో జట్టుకు కెప్టెన్ గా రాహుల్ వ్యవహరించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో దారుణంగా ఓడిపోయింది. అదే సమయంలో మైదానంలోనే ఉన్న లక్నో జట్టు యజమాని
సంజీవ్ గొయెంకా కేఎల్ రాహుల్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో సున్నిత మనస్కుడైన కేఎల్ రాహుల్ ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించాడు. అంతేకాదు తను జట్టు నుంచి బయటికి వెళ్తానని సంకేతాలు ఇచ్చాడు. దీంతో గత ఏడాది జరిగిన మెగా వేలంలో అతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. మొదట్లో కే ఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ జట్టు నుంచి రిషబ్ పంత్ కూడా బయటికి వచ్చాడు. అతడిని 27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కెప్టెన్ గా నియమించింది. దీంతో ఢిల్లీ జట్టుకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ ను చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో.. తనకు కెప్టెన్సీ వద్దని.. బ్యాటింగ్ మీదనే దృష్టి సారిస్తానని చెప్పడంతో అక్షర్ పటేల్ కు ఢిల్లీ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక అతడి ఆధ్వర్యంలో ఢిల్లీ జట్టు మూడు మ్యాచ్లు ఆడి.. మూడింటిలోనూ విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక కె.ఎల్ రాహుల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ మీద దృష్టి సారించడంతో.. విలువైన ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఏకంగా 77 పరుగులు చేయడంతో.. సోషల్ మీడియాలో సంజీవ్ గొయెంకా ను నెటిజన్లు ఏసుకుంటున్నారు. గత సీజన్లో అడ్డగోలుగా కేఎల్ రాహుల్ ను విమర్శించారని.. ఆణిముత్యం లాంటి ఆటగాడిని వదులుకున్నారని.. ఇప్పుడు అతడు ఢిల్లీ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడని.. అందువల్లే కొన్ని నిర్ణయాలు బుద్ధితో తీసుకోవాలని.. విచక్షణతో అమలు చేయాలని నెటిజన్లు సంజీవ్ గొయెంకా కు సూచిస్తున్నారు.