Virat Kohli (9)
Virat Kohli: విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతము 36 సంవత్సరాలు. అయినప్పటికీ అతడికి వయసు అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. అతడి శరీర సామర్థ్యం గురించి చెప్పాలంటే కొలమానాలు సరిపోవు. పోల్చాలంటే ఉపమానాలు దరిదాపుల్లోకి రావు. విరాట్ కోహ్లీ ఎలాగైనా ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఆడతాడు.. ఫామ్ లేకపోవడం అనేది విరాట్ కోహ్లీకి తాత్కాలికం మాత్రమే. పరుగుల వరద సృష్టించడం అతడికి శాశ్వతం. అందువల్లే విరాట్ కోహ్లీని నయా క్రికెట్లో రన్ మిషన్ అని పిలుస్తుంటారు. ఇక విరాట్ కోహ్లీకి ఐపీఎల్లో అద్భుతమైన రికార్డు ఉంది. గత సీజన్లో అతడు హైయెస్ట్ రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అరివిర భయంకరమైన బౌలర్లను సైతం పడుకోబెట్టి.. పరుగుల వరద పారించాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 18వ ఎడిషన్ లోనూ దుమ్ము రేపుతున్నాడు. కోల్ కతా జట్టు తో జరిగిన తొలి మ్యాచ్లో వీర విహారం చేస్తున్నాడు.
Also Read: కోల్ కతా పై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఈసాలా కప్ నమదేనా..
అలవోకగా..
ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా రంగంలోకి దిగింది. తొలి మ్యాచ్ ను బెంగళూరు తో ఆడింది.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్ కతా జట్టులో కెప్టెన్ రహానే 56, సునీల్ నరైన్ 44, రఘు వంశీ 30 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. హేజిల్ వుడ్ రెండు వికెట్లు సాధించాడు. కోల్ కతా విధించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు చేదించేందుకు.. ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బెంగళూరు ఓపెనర్లు సాల్ట్ (56), విరాట్ కోహ్లీ (59*) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 8.3 ఓవర్లలోనే 95 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్ కతా బౌలర్ల పై ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగాడు. ఇక ఇదే సమయంలో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో నాలుగు జట్ల పై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడుగా నిలిచాడు..కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు హాఫ్ సెంచరీ చేయడం ద్వారా 1000 పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. గతంలో చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ జట్లపై విరాట్ కోహ్లీ 1000 పరుగులు చేశాడు.. ఇక డేవిడ్ వార్నర్ కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్, రోహిత్ శర్మ కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, శిఖర్ ధావన్ చెన్నై జట్ల పై మాత్రమే వెయ్యి పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.