KKR Vs PBKS: 262 ఏ మూలకూ సరిపోలేదు.. ఇది కదా చేజింగ్ అంటే..

కోల్ కతా మైదానంపై 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడం అంత ఈజీ కాదు. పైగా కోల్ కతా జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. అయినప్పటికీ బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో అద్భుతంగా ఆడారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 27, 2024 10:11 am

KKR Vs PBKS

Follow us on

KKR Vs PBKS: 261 రన్స్.. ఐపీఎల్ లో భారీ స్కోరు. దీన్ని చేజింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అది కూడా వరుస ఓటములు ఎదుర్కొంటున్న జట్టు వల్ల అస్సలు కాదు. కానీ, దీని చేజ్ చేసి నిరూపించింది పంజాబ్ జట్టు.. బలమైన కోల్ కతా మీద ఈ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముందుగా కోల్ కతా జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 261 రన్స్ చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (75), సునీల్ నరైన్(71) అర్థ సెంచరీలు చేశారు. వెంకటేష్ అయ్యర్ 29, శ్రేయస్ అయ్యర్ 28 ఎదురుదాడికి దిగడంతో కోల్ కతా జట్టు 261 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2, సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం చేజింగ్ కు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 262 రన్స్ చేసి విజయాన్ని దక్కించుకుంది. ఫామ్ లేమితో బాధపడుతున్న జానీ బెయిర్ స్టో ఒక్కసారిగా టచ్ లోకి వచ్చాడు. కీలకమైన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ ను గెలిపించాడు. 48 బంతులు ఎదుర్కొన్న అతడు ఎనిమిది ఫోర్లు, 9 సిక్స్ ల సహాయంతో 108* పరుగులు చేశాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 54, శశాంక్ సింగ్ 68 అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు.

వాస్తవానికి కోల్ కతా మైదానంపై 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడం అంత ఈజీ కాదు. పైగా కోల్ కతా జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. అయినప్పటికీ బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో అద్భుతంగా ఆడారు. ప్రారంభం నుంచే ఎదురు దాడికి దిగారు. విధ్వంసకర ఆటతీరుతో స్కోర్ బోర్డ్ ను మారథాన్ గేమ్ ఆడించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 16 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సునీల్ నరైన్ వేసిన అద్భుతమైన త్రోకు అతడు రన్ అవుట్ అయ్యాడు. లేకుంటే పంజాబ్ జట్టు స్కోరు మరో విధంగా ఉండేది. పంజాబ్ జట్టు పవర్ ప్లే లో ఏకంగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసింది. రోల్ రొసౌ(26) తో కలిసి బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో, సునీల్ నరైన్ అద్భుతమైన బంతివేసి ఈ జోడిని విడదీశాడు. రోల్ రొసౌ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగిన తర్వాత.. శశాంక్ సింగ్ సహాయంతో బెయిర్ స్టో 45 బంతుల్లో సెంచరీ మార్క్ పూర్తి చేశాడు.. శశాంక్ సింగ్ సైతం 23 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దీంతో పంజాబ్ విజయ సమీకరణం 12 బంతుల్లో 9 పరుగులకు చేరింది. రమణ్ దీప్ సింగ్ వేసిన 19 ఓవర్ లో శశాంక్ సింగ్ 6 కొట్టి.. పంజాబ్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.