AP Elections 2024: ఏపీలో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. పోలింగ్ సమీపిస్తుండడంతో ఉధృతంగా సాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మరోవైపు స్క్రూట్నీ సైతం పూర్తి చేశారు. మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు జోష్ పెంచాయి. అధికార వైసిపి, మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి కూటమి, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు సైతం చేసుకుంటున్నారు.
అయితే సీఎం జగన్ తో పాటు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబుతో పాటు పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి హత్య అంశంతో పాటు జగన్ పై వారిద్దరూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనంపై కూడా చాలా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి పూర్తి వివరాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డి హత్య అంశము కోర్టు పరిధిలో ఉండగా.. పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే గత కొన్నేళ్లుగా ఏపీలో విమర్శలు, ఆరోపణలు పరస్పరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల వివేకానంద రెడ్డి హత్య అంశంపై విపక్షాలు ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నాయి.దీంతో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. గత ఎన్నికల్లో ఇదే వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని వైసిపి ఎక్కువగా ప్రస్తావించింది. అప్పట్లో రాజకీయంగా లబ్ధి పొందింది. ప్రజలు కూడా సానుభూతి చూపారు. ఇప్పుడు మాత్రం అదే వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఇది వైసిపి కలవరపాటుకు కారణమవుతోంది. అందుకే వైసిపి శ్రేణులు దీనిపై విపక్షాలు మాట్లాడకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ చంద్రబాబుతో పాటు పవన్ పై నిఘా పెంచనుందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.అలా అయితే అడుగడుగునా వైసిపి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని టిడిపి చెబుతోంది.ఆ లెక్కన అధికార పక్షంపై సైతం ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకోవాలని టిడిపి కోరుతోంది.