KKR Vs MI: కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయినప్పటికీ.. ముంబై జట్టులోని కీలక ఆటగాళ్లు ఇషాన్ కిషన్, జస్ ప్రీత్ బుమ్రా సరికొత్త ఘనతను తన పేరు మీద లిఖించుకున్నారు. ముంబై జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. డికాక్ 47 ఔట్లలో పాలుపంచుకున్నాడు.. ఇషాన్ కిషన్ 48 డిస్ మిసల్స్ లో తన వంతు పాత్ర పోషించాడు.
జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కోల్ కతా ఆటగాడు రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోవడం ద్వారా ఇషాన్ కిషన్ ఈ ఘనతను తన వశం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జస్ ప్రీత్ బుమ్రా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు . ఇప్పటివరకు జస్ ప్రీత్ బుమ్రా ఐపీఎల్ సీజన్ లో నాలుగుసార్లు 20 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. జస్ ప్రీత్ బుమ్రా కంటే ముందు ఈ జాబితాలో రాజస్థాన్ బౌలర్ చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు ఐదుసార్లు 20 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఒకప్పటి బౌలర్ లసిత్ మలింగ, జస్ ప్రీత్ బుమ్రా ఆ తర్వాత స్థానాలలో కొనసాగుతున్నారు.
ముంబై జట్టు తరఫున అత్యధిక వికెట్లలో భాగస్వామ్యులైన వికెట్ కీపర్లు వీరే..
ఇషాన్ కిషన్ 48, క్వింటన్ డికాక్ 47, పార్దివ్ పటేల్ 28, దినేష్ కార్తీక్ 21 సార్లు డిస్ మిసల్స్ లో భాగమయ్యారు. యజువేంద్ర చాహల్ 5, జస్ ప్రీత్ బుమ్రా, మలింగ 4 సార్లు 20 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు.
ఇక ఈ మ్యాచ్ లో ముందుగా కోల్ కతా బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా 16 ఓవర్లకు మ్యాచ్ కుదించడంతో.. 157 రన్స్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 42, నితీష్ రాణా 33 దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, జస్ ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నువాన్ తుషారా, కంభోజ్ చెరో వికెట్ పడగొట్టారు.