Shubman Gill Health: టీమిండియా కెప్టెన్ గిల్ ఇటీవల ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో గాయపడ్డాడు. తీవ్రమైన మెడ కండరాల నొప్పితో అతను బాధపడుతూ కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొని డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడిని ఐసియూకి తరలించారు. వాస్తవానికి అతడు కోలుకుంటాడని.. మైదానంలోకి అడుగుపెడతాడని అందరూ అనుకున్నారు. కానీ అందరూ ఊహించినట్టుగా అతడు బ్యాటింగ్ కు రాలేదు.
రెండు రోజులపాటు చికిత్స పొందిన అతడు ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. రెండో టెస్టులో అతడు ఆడతాడని అనుకున్నప్పటికీ.. వైద్యుల సలహాల మేరకు అతడు ఆడే అవకాశం లేదని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు, వన్డే, టి20 సిరీస్ లకు కూడా అతడు అందుబాటులో ఉండడని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో వన్డే సిరీస్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయంపై స్పష్టత లేకుండాపోయింది. కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు.
గిల్ దూర ప్రయాణాలు చేయకూడదని వైద్యులు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం అతడు జుట్టుతోనే ఉంటున్నాడు. గుహవాటి వెళ్లినప్పటికీ అతడు రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే అతడి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. జనవరిలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా అతడు మైదానంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసిద్ధ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. “గిల్ మెడ కండరాల నొప్పి ఇంతవరకు తగ్గలేదు. వైద్యుల సలహాల మేరకు అతడు ఇంకా కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. నిర్విరామమైన క్రికెట్ ఆడటం వల్ల అతడి మెడ కండరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అందువల్లే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ ప్రకారం ఇంకా అతడు కొద్దిరోజులపాటు జుట్టుకు దూరంగా ఉంటాడు. ఆ తర్వాత అతడు ఆరోగ్య పరిస్థితిని బట్టి జనవరిలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా మేనేజ్మెంట్ ఎంపిక చేసే అవకాశం ఉందని” టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
కొన్ని మీడియా సంస్థలు మాత్రం గిల్ ఆరోగ్యం గురించి మరో విధంగా చెబుతున్నాయి దక్షిణాఫ్రికా తో సిరీస్ ముగిసిన తర్వాత అతడు టి20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే టి20 వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో గిల్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ పాతిక సంవత్సరాల వయసులోనే టీమ్ ఇండియాకు కెప్టెన్ అయిన గిల్.. నిర్విరామమైన క్రికెట్ ఆడి చివరికి తన కెరియర్ నే ప్రశ్నార్ధకం చేసుకున్నాడు.