Kamla Pasand AD: కపిల్, గేల్ నిజం చెప్పండి.. కమలా పసంద్ యాడ్ మీ స్థాయికి తగ్గదేనా?

ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. అమెరికా - వెస్టిండీస్ దేశాలు ఈ మెగా టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్నాయి.. ఈ క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 6:00 pm

Kamla Pasand AD

Follow us on

Kamla Pasand AD: సెలబ్రిటీ అన్నాక సమాజం మీద ఎంతో కొంత గౌరవం ఉండాలి. తమకు ఇంతటి స్టార్ డం ఇచ్చిన ప్రజల పట్ల ఎంతో కొంత ప్రేమ ఉండాలి. ఓ సాయి పల్లవిని తీసుకుంటే.. ఓ ఫెయిర్నెస్ క్రీమ్ సంస్థ కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ.. ఆ యాడ్ లో నటించలేదు. చివరికి ప్రఖ్యాత స్త్రీల సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ బ్లాంక్ చెక్ ఇచ్చినా విసిరి ముఖాన కొట్టింది.. అయితే ఇలా సమాజం మీద స్పృహ ఉన్న నటీ నటులను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. అదేంటి దీపం ఉన్నాకనే కదా ఇల్లు చక్కబెట్టుకునేది.. ప్రకటనలో సెలబ్రిటీలు నటించినంత మాత్రానా సమాజం ప్రభావితమవుతుందా? జనం ఎగబడి కొనేస్తారా? విరగబడి వాడతారా? అనే అనుమానం మీకు రావచ్చు. మనదేశంలో సినిమా నటులకు, క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ మరెవరికీ లేదు. వీరికి వీరాభిమానులు కాదు డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. సచిన్ వాడిన బూట్లను ధరిస్తారు. ద్రావిడ్ తాగిన బూస్ట్ కొనేస్తారు. మహేంద్ర సింగ్ ధోని ధరించిన క్యాప్ వాడతారు. యువరాజ్ సింగ్ తొక్కిన సైకిల్ ను స్టేటస్ సింబల్ గా భావిస్తారు.. అక్కడిదాకా ఎందుకు? ఆ మధ్య ఎవరో నటుడు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటనలో నటిస్తే.. చాలామంది అక్కడి వెంచర్లో ఫ్లాట్లు కొన్నారు. చివరికి ఆ సంస్థ బోర్డు తిప్పేస్తే కొనుగోలు చేసిన వారంతా లబోదిబో అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకయ్యా ఈ చర్చ మొత్తం అంటే.. అక్కడికే వస్తున్నాం జర ఆగండి..

ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. అమెరికా – వెస్టిండీస్ దేశాలు ఈ మెగా టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్నాయి.. ఈ క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.. మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటనలకు భారీగానే డిస్నీ వసూలు చేస్తోంది.. అయితే ఈ ప్రకటనల్లో చూసే ప్రేక్షకులకు చివుక్కు మనిపించే ఒక యాడ్ ఉంది. అదే కమలా పసంద్.. స్థూలంగా చెప్పాలంటే పాన్ మసాలా. పాన్ మసాలా అనేది పొగాకు తో తయారు చేసే ఉత్పత్తి.. సాధారణంగా పొగాకు అనేది మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. దీర్ఘకాలంలో దానిని వాడితే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి.. అందుకే పొగాకుతో తయారు చేసే సిగరెట్ పెట్టెల మీద “పొగాకు ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కు కారకం” అని హెచ్చరికలతో కూడిన పదాలు ఉంటాయి. అయితే ఇటువంటి కమలా పసంద్ యాడ్ ను సీనియర్ క్రికెటర్లు కపిల్ దేవ్, గేల్ ప్రమోట్ చేస్తున్నారు.. ఆ కంపెనీ ఎంత ఇస్తుందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన ప్రకటనల్లో వీరిద్దరూ మెరుస్తున్నారు. పైగా వారు కమలాపసంద్ పాన్ మసాలాను తినడం ఇబ్బందికరంగా ఉంది. ఇది వారికి ఎటువంటి స్టేటస్ సింబల్ తీసుకువస్తుందో తెలియదు కానీ.. వారు చెబుతున్నారు కదా అని మిగతావారు పాన్ మసాలా తినే ప్రమాదం ఉంది.

వాస్తవానికి కపిల్ దేవ్ లెజెండరీ క్రికెటర్. అతని వయసు కూడా 60 దాటింది. గేల్ దాదాపు 50 లో ఉన్నాడు. వీరిద్దరూ తమ కెరియర్లో ఉచ్చ స్థితులను చూశారు. కొత్తగా వీరు సాధించడానికి.. ఇంకా వెనకేయడానికి ఏమీ లేదు. ఎట్లాగూ సీనియర్ క్రికెటర్లు కాబట్టి వర్ధమాన ఆటగాళ్లకు తమ అనుభవాన్ని నూరిపోస్తే చాలా బాగుంటుంది. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు ఒక పాఠం లాగా.. వీరికి ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోతుంది. అలా చేయాల్సింది పోయి.. పాన్ మసాలా యాడ్స్లో వీరిద్దరూ కనిపించడం.. పైగా దానిని తింటే ఉత్సాహం వస్తుంది అని చెప్పడం .. చూసే ప్రేక్షకులకు బాధ కలిగిస్తోంది. సెలబ్రిటీలుగా సమాజంపై బాధ్యత ఉండాల్సిన వీరు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడం నిజంగా దారుణం. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి..” కపిల్, గేల్.. మీరు నిజం చెప్పండి.. ఇలాంటి ప్రకటనలు మీ స్థాయికి దగ్గవేనా” అని కామెంట్లు చేస్తున్నారు.