https://oktelugu.com/

Ind Vs Nz 2nd Test: పూణే టెస్ట్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ కు షాక్.. జట్టుకు దూరమైన కీలక ఆటగాడు

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించి న్యూజిలాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే సానుకూల దృక్పథంతో రెండవ టెస్ట్ కు సిద్ధమవుతోంది. పూణే వేదికగా రెండవ టెస్టు జరగనుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 22, 2024 / 01:00 PM IST

    Ind Vs Nz 2nd Test

    Follow us on

    Ind Vs Nz 2nd Test: పూణే వేదికగా జరిగే రెండవ టెస్ట్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు కెన్ విలియంసన్ రెండవ టెస్టుకు దూరమయ్యాడు. టెస్ట్ క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న కేన్ విలియంసన్ జట్టుకు దూరం కావడం ఒక రకంగా న్యూజిలాండ్ కు దెబ్బేనని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేన్ విలియంసన్ జట్టుకు దూరమైన విషయాన్ని న్యూజిలాండ్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది..” రెండో టెస్టు ప్రారంభానికి ముందు అనుకోని అవాంతరం ఏర్పడింది. గజ్జల్లో ఏర్పడిన గాయం వల్ల కేన్ విలియంసన్ రెండవ టెస్టు కు దూరమయ్యాడు. మూడవ టెస్ట్ నాటికి అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నామని” ఆ ట్వీట్ లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పేర్కొంది.. కెన్ విలియంసన్ గత కొంతకాలంగా గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. దానికి అతడు శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు 100 శాతం ఫిట్ నెస్ సాధించినప్పటికీ.. జట్టు అవసరాల దృష్ట్యా.. రెండవ టెస్టుకు దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మరి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత అతడిని జట్టులోకి తీసుకుంటామని న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ ప్రకటించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఇక ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో భారత జట్టుపై చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత టెస్ట్ విజయాన్ని అందుకుంది. 1988లో న్యూజిలాండ్ భారత జట్టుపై టెస్ట్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇంతవరకు మరో విజయం సాధించలేదు. ఇటీవల బెంగళూరులో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలుపును సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టును 50 పరుగుల లోపే ఆల్ అవుట్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 400+ పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా దాటిగా ఆడినప్పటికీ.. లోయర్ ఆర్డర్ వైఫల్యం వల్ల 108 పరుగుల విజయ లక్ష్యాన్ని మాత్రమే న్యూజిలాండ్ జట్టు ముందు ఉంచింది. దానిని రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ చేదించడంతో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. అయితే తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో టీమిండియా పూణే టెస్టుకు అనేక మార్పులు చేపడుతోంది. ఇందులో సరిగ్గా ఆడని ఆటగాళ్లకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్, సిరాజ్ వంటి ఆటగాళ్లకు రెండవ టెస్టులో అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది.