USA vs ENG: బంతి పై ఏదో దీర్ఘకాలికంగా శత్రుత్వం ఉన్నట్టు.. బౌలర్ తో గెట్టు పంచాయితీ ఉన్నట్టు.. అదేం కొట్టుడు.. అదేం బ్యాటింగ్.. బౌలర్ బంతి వేయడమే ఆలస్యం.. గాలిలో చక్కర్లు కొడుతోంది. ఏకంగా స్టాండ్స్ అవతల పడుతోంది. ఒక బంతి ఇలా పడిందనుకుంటే అదృష్టం అనుకోవాలి. రెండవ బంతి కూడా అలానే వెళ్లిందంటే కాలం కలిసి వచ్చిందనుకోవాలి. కానీ అతను వరుసగా ఐదు బంతుల్ని అలానే స్టాండ్స్ అవతలికి పంపించాడు. బౌలర్ ఎన్ని రకాలుగా బంతులు వేసినప్పటికీ.. అతడు మాత్రం బాదుడే మంత్రంగా పెట్టుకున్నాడు. ఊర కొట్టుడు, నాటు కొట్టుడు, దంచి కొట్టుడు, విరగకొట్టుడు.. ఇలా ఎన్ని పదాలుంటే అన్ని పదాలు.. ఎన్ని అన్వయాలు ఉంటే.. అన్ని అన్వయాలు.. వాడొచ్చు.. మరింత ఉపమానికరించొచ్చు..
బార్బడోస్ వేదికగా అమెరికాతో ఆదివారం జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ నభూతో నభవిష్యతి అనే తీరుగా ఆడాడు. 38 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆర్ ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.. ముఖ్యంగా బట్టల హర్మిత్ సింగ్ బౌలింగ్లో ఏకంగా ఐదు సిక్సర్లు కొట్టాడు.. 32 పరుగులు సాధించాడు.. ఈ ఓవర్ లో తొలి బంతికి సింగిల్ తీసి సాల్ట్ బట్లర్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బట్లర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో హర్మీత్ సింగ్ తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయాడు. చివరి బంతిని వైడ్ వేశాడు. ఇక ఆఖరి బంతిని కూడా బట్లర్ వదిలిపెట్టలేదు. దానిని లాంగ్ ఆన్ మీదుగా గట్టిగా కొడితే స్టాండ్స్ అవతల పడింది.. వాస్తవానికి సాల్ట్ కాకుండా స్ట్రైకింగ్ అవకాశం బట్లర్ కు వచ్చి ఉంటే యువరాజ్ సింగ్ రికార్డును కచ్చితంగా బద్దలు కొట్టేవాడు కావచ్చు.
2007 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఇండియన్ స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్.. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఇక బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో నేరుగా సెమీస్ దూసుకెళ్లింది. అమెరికా విధించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ కోల్పోకుండా, కేవలం 9.4 ఓవర్లలోనే చేదించడం విశేషం.. తొలి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ ఆరు పరుగులు మాత్రమే చేసింది. కానీ అప్పుడే బట్లర్ తన గేర్ మార్చాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అద్భుతమైన విజయంతో సెమిస్ దూసుకెళ్లింది.