Ashes Series : యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో ఐదో రోజు ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో రన్ అవుట్ అయిన విధానంపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఆస్ట్రేలియా జట్టు తొండాట ఆడి బెయిర్ స్టోను అవుట్ చేసి విజయం సాధించిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విమర్శలపై ఆస్ట్రేలియా మీడియా కౌంటర్లకు దిగింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఎగతాళి చేస్తూ కథనాలు ప్రచురించడం గమనార్హం.
ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుది భిన్నమైన శైలి. ఏ మ్యాచ్ లో అయినా విజయమే లక్ష్యంగా ఆ జట్టు బరిలోకి దిగుతుంది. విజయం కోసం ఏం చేయడానికైనా ఆ జట్టు సభ్యులు వెనకాడరు. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ జట్టు కీపర్ అలెక్స్ క్యారీ.. జానీ బెయిర్ స్టోను అవుట్ చేసిన విధానం అందరికీ తెలిసిందే. ఓవర్ ముగిసిందని బెయిర్ స్టో అవతలి ఎండ్ లో ఉన్న బెన్ స్టోక్స్ ను కలిసేందుకు వెళ్లే ప్రయత్నంలో క్రీజు విడిచి బయటకు వచ్చాడు. ఇదే అదునుగా అప్పటికే చేతిలో బంతిని పట్టుకొని ఉన్న అలెక్స్ క్యారీ వికెట్లను గిరాటేశాడు. బంతి నేరుగా వికెట్లను తాకడంతో పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా ఆటగాళ్లు రనౌట్ కోసం అప్పీల్ చేశారు. మూడో ఎంపైర్ కూడా పరిశీలించి అవుట్ గా ప్రకటించాడు. సాంకేతికంగా అవుట్ అయినప్పటికీ.. ఈ తరహా రన్ అవుట్లను ప్లేయర్లు పెద్దగా అంగీకరించరు. దీనిపై ఇంగ్లాండు జట్టు ఆటగాళ్లయిన బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ అప్పీల్ ను వెనెక్కి తీసుకోవాలని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ ను కోరారు. కమిన్స్ అందుకు అంగీకరించకపోవడంతో బెయిర్ స్టో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ వికెట్ పడిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు కోలుకోవడం సాధ్యం కాలేదు. వెరసి 40కిపైగా పరుగులు తేడాతో ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టులో ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియా జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు..
ఈ వికెట్ తీసుకున్న విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా జట్టు నిబంధనలకు విరుద్ధంగా, క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించిందంటూ ఇంగ్లాండ్ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా దుమ్మెత్తి పోశారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటుగా మారిపోయిందని, ఆస్ట్రేలియా జట్టుకు విజయం తప్ప మరొకటి అవసరం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ తరహా విధానాలు వల్ల వచ్చే విజయాలు ఆ జట్టుకు పేరు తీసుకురావని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే, ఆస్ట్రేలియా జట్టుపై వచ్చిన విమర్శలను ఆ దేశ మీడియా డిఫండ్ చేయడంతోపాటు కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఆ దేశంలోని ప్రధాన మీడియా పత్రికల్లో ఇంగ్లాండు ఆటగాళ్లను విమర్శించేలా కార్టూన్లతో కూడిన కథనాలను ప్రచురించింది.
ఆస్ట్రేలియా జట్టుకు అండగా నిలిచే మీడియా…
ఆస్ట్రేలియా జట్టు ఏం చేసినా ఆదేశం మీడియా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది బెయిర్ స్టో అవుట్ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఆ దేశ మీడియా మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అండగా నిలుస్తూ కథనాలను ప్రచురించింది. ఈ వ్యవహారంపై ‘ క్రై బేబీస్ ‘ శీర్షికతో ఆ దేశంలోని ప్రధాన మీడియా పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించింది. ఈ కథనంలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ నోట్లో పాలపీక పెట్టుకుని, డైపర్ వేసుకున్న చిన్న పిల్లాడిలా చిత్రీకరిస్తూ కథనం రాసింది. పక్కన బాల్, యాషెస్ కప్ పెట్టింది. బెయిర్ స్టో ఔట్ అయిన సమయంలో అవతలి ఎండ్ లో స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ ఏమి అమాయకుడు కాదు అన్న విషయాన్ని ఆ పత్రిక ఇలా బైటకు తెలియజేసే ప్రయత్నం చేసింది. ఇది ఒకరకంగా ఆస్ట్రేలియా జట్టును డిఫెండ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ దేశ మీడియా ఇలా చేస్తోంది అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్ట్రోక్స్ కూడా స్పందించాడు. ఇది కచ్చితంగా తాను కాదని, తాను ఎప్పుడు కొత్త బంతితో బౌలింగ్ చేయలేదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా జట్టు చేసిన తప్పిదాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం మీడియా చేస్తున్న రచ్చ కూడా ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.