Aus vs IND : ఆస్ట్రేలియాపై తన మ్యాజిక్ బౌలింగ్ ను బుమ్రా కొనసాగిస్తున్నాడు. మైదానంపై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన బంతులు సంధిస్తున్నాడు. అతడి బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంబేలెత్తుతున్నారు శనివారం మ్యాచ్లో తన తొలి బంతికే కేరీ(21) ను బుమ్రా అవుట్ చేశాడు. అతడు వేసిన బంతిని ఎదుర్కోలేక కేరి వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేరీని అవుట్ చేయడం ద్వారా బుమ్రా తన ఖాతాలో ఐదు వికెట్లను వేసుకున్నాడు. ఇదే క్రమంలో అద్భుతమైన ఘనతను బుమ్రా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా పై ఎక్కువసార్లు 5 వికెట్లు సాధించిన భారత బౌలర్ కపిల్ దేవ్ సరసన అతడు నిలిచాడు. కపిల్, బుమ్రా ఏడుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు. ఇన్నింగ్స్ ల ప్రకారం చూసుకుంటే కపిల్ కంటే వేగంగా ఈ రికార్డును సొంతం చేసుకున్న ఘనత బుమ్రా దే. 51 ఇన్నింగ్స్ లలో బుమ్రా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్ లలో ఏడుసార్లు 5 వికెట్లను నేలకూల్చాడు. కేప్ టౌన్, నాటింగ్ హం, పెర్త్ లలో ఒకసారి బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్ర ప్రకారం చూసుకుంటే మొత్తంగా ఓ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను 11 సార్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా పై మూడు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, భారత్ వేదికగా రెండుసార్లు బుమ్రా ఈ రికార్డును సృష్టించాడు.
బ్యాటింగ్ ఎంచుకొని
పెర్త్ టెస్ట్ కు బుమ్రా కెప్టెన్సీ వహిస్తున్నాడు. రోహిత్ శర్మ భార్య ప్రసవించడంతో అతడు ఇండియాలోనే ఉండిపోయాడు. అతడు సెలవు కోరడంతో తొలి టెస్ట్ నుంచి బీసీసీఐ అతడికి మినహాయింపు నిచ్చింది. దీంతో తొలి టెస్ట్ కు బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ మినహా.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ కూడా అలాగే సాగుతోంది. శనివారం రెండవ రోజు కడపటి వార్తలు అందే సమయానికి 9 వికెట్ల కోల్పోయి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మిచెల్ స్టార్క్(26*), హెజిల్ వుడ్(6*) లో ఉన్నారు. ఆస్ట్రేలియా టీమిండియా కంటే 47 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ కోల్పోయింది. 0-3 తేడాతో ఓడిపోవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత్ అడుగు పెట్టాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో విజయం సాధించాలి. ఇతర జట్టు సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్స్ వెళ్ళిపోవాలంటే 5-0 తేడాతో టెస్టు సిరీస్ దక్కించుకోవాలి.