US open 2024 : యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం.. టైటిల్ నెగ్గిన ఇటలీ స్టార్

అమెరికా వేదికగా జరిగిన ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లోనూ సంచలనం నమోదయింది. మహిళల సింగిల్స్ బెలారస్ క్రీడాకారిణి సబ లెంక గెలిస్తే.. పురుషులకు భాగంలో ఇటలీ స్టార్ ఆటగాడు, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ జానిక్ సినర్ దక్కించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 2:29 pm

US open 2024 Winner

Follow us on

US open 2024 :  ఆదివారం అర్ధరాత్రి ఫైనల్ మ్యాచ్ జరిగింది.. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ పై సినర్ 6-3, 6-4, 7-5 వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ సీజన్లో సినర్ కు ఇది రెండవ ట్రోఫీ.. అంతకు ముందు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అతడు విజేతగా నిలిచాడు.. ఫైనల్ మ్యాచ్ దాదాపు రెండు గంటల 16 నిమిషాల పాటు జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో సినర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.. తొలిసారిగా గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఫ్రిట్జ్ కు చుక్కలు చూపించాడు. సంచలనానికి తావు లేకుండా వరుసగా మూడు సెట్లు సొంతం చేసుకొని.. ప్రొసీడ్ దక్కించుకున్నాడు. ఈ విజయం ద్వారా ఇటలీ అభిమానులు పండగ చేసుకోగా.. రెండు దశాబ్దాల నుంచి యూఎస్ ఓపెన్ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న అమెరికన్ల కు మరో నిరీక్షణ తప్పలేదు.

గ్రాండ్ స్లామ్ గెలిచిన దాఖలాలు లేవు..

అండి రాడిక్ తర్వాత ఇప్పటివరకు ఏ అమెరికన్ ప్లేయర్ కూడా టెన్నిస్ టోర్నమెంట్ గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. అయితే దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫ్రిట్జ్ ఫైనల్ చేరుకున్నాడు. దీంతో అమెరికన్ అభిమానులు అతనిపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతాడని భావించారు.. కానీ ఫ్రిట్జ్ అంచనాలు అందుకోలేకపోయాడు. ఫైనల్ లో సినర్ ను ప్రతిఘటించలేకపోయాడు. కనీసం ఒక సెట్ కూడా గెలుచుకోలేకపోయాడు. హోరాహోరి ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. కీలక సమయాలలో ఫ్రిట్జ్ చేతులెత్తేయడంతో సినర్ పై చేయి సాధించాడు. తన ర్యాంకు తగ్గట్టుగా ప్రదర్శన చేసి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

మహిళల డబుల్స్ విభాగంలో..

ఇక మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ ను లాత్వియా – ఉక్రెయిన్ దేశాలకు చెందిన ఒస్టాపెంకో, కి చెంక్ జోడి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ – చైనా దేశానికి చెందిన మ్ల దనోవిచ్, జెంగ్ పై 6-4, 6-3 వరుస సెట్లలో గెలిచింది. ఇక మహిళల సింగిల్స్ లో బెలారస్ కు చెందిన అర్యానా సబ లెంక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా పై ఆమె 7-5, 7-5 వరుస సెట్లలో విజయం సాధించింది. సబ లెంక వయసు ప్రస్తుతం 26 సంవత్సరాలు. ఆమెకు ఇది తొలి యూఎస్ ఓపెన్ టైటిల్. కెరియర్ పరంగా చూసుకుంటే మూడవ గ్రాండ్ స్లామ్. ఇప్పటికే ఆమె 2023, 2024 సీజన్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకుంది.