WTC final: ఇటీవలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఫైనల్ లో ఓటమి పాలైన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు భావిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా ఇప్పటినుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళి టోర్నీలో ఆడాలనే నిబంధనలను తప్పనిసరి చేసింది. అయితే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని చాలామంది అభిమానులకు ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు క్రికెట్లో దాయాదులుగా కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. ఈ రెండు జట్లు ఎప్పుడు క్రికెట్ ఆడినా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అందుకే ఐసీసీ నిర్వహించే వన్డే, టీ 20 టోర్నీలలో కచ్చితంగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లు ఉండే విధంగా రూపకల్పన చేస్తుంది.
ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.. పాకిస్తాన్ 8వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. సీజన్ ముగిసే సమయానికి టెస్ట్ పాయింట్ల జాబితాలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో తలపడతాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ రెండవ స్థానాల్లోకి ప్రవేశించాలంటే అనితరసాధ్యమైన అద్భుతాలు జరగాలి.. ఇది జరగడం అసాధ్యం కాబట్టి ఆస్ట్రేలియా – భారత్ మధ్య మరోసారి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్వదేశంలో పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో తన ర్యాంకును కూడా 8వ స్థానానికి దిగజార్చుకుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ రెండవ స్థానానికి చేరుకోవడం దాదాపు అసాధ్యం.. పైగా ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. బంగ్లాదేశ్ జట్టుతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు.. ఇలా సీజన్ ముగిసేనాటికి 10 టెస్ట్ మ్యాచ్ లను భారత్ ఆడుతుంది.
వాస్తవానికి బంగ్లాదేశ్ జట్టుతో తొలి టెస్ట్ లో గనుక పాకిస్తాన్ మెరుగ్గా ఆడి ఉంటే.. ఆ జట్టు ర్యాంక్ పెరిగేది. అలానే ఆ విజయాలను కొనసాగించే కసరత్తు చేస్తే రెండవ స్థానానికి చేరుకునేది. అప్పుడు భారత్ – పాకిస్తాన్ ఫైనల్ లో తలపడేవి.. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉంది. 9 మ్యాచ్లలో ఆరు గెలిచి, రెండు ఓడిపోయిన భారత్.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో 68.52 విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. ఇక పాకిస్తాన్ పరిస్థితి మరిత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆరు మ్యాచ్లు ఆడి.. కేవలం రెండు మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.. 30.56 విన్నింగ్ పర్సంటేజ్ మాత్రమే కలిగి ఉంది.