Nitish Kumar Reddy
Nitish Kumar Reddy: ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి.. వారికి అవకాశాలు ఇవ్వడంలో.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. ప్లేయర్ బలం గురించి.. బలహీనతల గురించి ప్రతిక్షణం అంచనా వేస్తూ.. వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉండే విధంగా నిత్యం శ్రమిస్తూ ఉంటాడు. గౌతమ్ గంభీర్ ఈ స్థాయిలో శ్రద్ధ వహిస్తాడు కాబట్టే..కోల్ కతా జట్టు గత ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరించింది.
యువ ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటాడు. జట్టులో యువ రక్తం ఎక్కించడానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు. అందువల్లే టీమిండియా గతంతో పోల్చి చూస్తే నూతనత్వంతో కనిపిస్తోంది. గెలుపులు, ఓటములు పక్కన పెడితే జట్టును ప్రత్యేకంగా నిలపడంలో గౌతమ్ గంభీర్ విజయవంతమైన చెప్పవచ్చు.. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్లేయర్ల మేనేజ్మెంట్ విషయంలో అతడు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ టీమిండియా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతోంది. ఇందులో నుంచి తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తప్పుకోవడం సంచలనంగా మారింది.. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టి20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అతని గాయపడ్డాడు. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో హార్డ్ హిట్టర్ శివం దూబె ను నియమించినట్టు సెలక్టర్లు ప్రకటించారు. అయితే నిన్నటిదాకా మెరుగైన సామర్థ్యంతో కనిపించిన నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఒక్కసారిగా సిరీస్ మొత్తానికి దూరం కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. అదే స్థాయిలో బౌలింగ్ చేసి.. ఉత్సాహంగా కనిపించిన చిన్నపాటి గాయానికే సిరీస్ మొత్తానికి దూరం కావడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు.. గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి వల్లే నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇలా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నూటికి నూరు శాతం
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో అదరగొట్టాడు. ఫీల్డింగ్లో తన సామర్థ్యాన్ని నూటికి నూరు శాతం నిరూపించుకున్నాడు. నెలరోజుల పాటు తీరికలేని క్రికెట్ ఆడి అలసిపోయినప్పటికీ.. అతడు తన సామర్థ్యం విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా అంతటి బిజీ షెడ్యూల్లో కూడా అతడు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అటువంటి ఆటగాడు చిన్నపాటి గాయానికి తట్టుకోలేకపోవడం నిజంగానే విమర్శలకు కారణమవుతోంది. వయసులో చిన్నవాడు కావడం.. వర్క్ లోడ్ పెరిగిపోవడంతో నితీష్ కుమార్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతోందనే ఆరోపణలు లేకపోలేదు. అందువల్లే అతడు గాయపడి సీరియస్ మొత్తానికి దూరమయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఏమోగానీ.. వారిని చేపలను రాకినట్టు రాకడం.. ఇబ్బందికి గురి చేస్తోందని.. యువ ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఇలాంటివి పునరావృతం అవుతాయని సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి గాయం కనక నితీష్ కుమార్ రెడ్డి కి మరోసారి రిపీట్ అయితే కెరియర్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.. నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆటగాళ్లు అరదుగా జట్టుకు లభిస్తారని.. అటువంటివారిని కాపాడుకోవాలని.. వారి వయసును.. ఇతర వాటిని అంచనా వేసి ట్రైనింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లేకపోతే జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒక ఆటగాడిని ఎంతసేపు ఆడించాలి.. ఎలాంటి సిరీస్ లకు ఎంపిక చేయాలి.. ఎలాంటి పరిస్థితుల్లో అతడికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కోచ్ నిర్ణయం మేరకు ఉంటుందని.. ఆ విషయంలో గౌతమ్ గంభీర్ ఫోకస్డ్ గా ఉండాలని వివరిస్తున్నారు. ప్లేయర్ల మేనేజ్మెంట్ ప్రణాళిక ప్రకారం లేకపోతే జట్టు భవిష్యత్తు కాలంలో భారీ మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.