https://oktelugu.com/

Brendon Mccullum : టెస్ట్ క్రికెట్ గతిని మార్చిన క్రికెటర్ అతనేనా..? ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం అయనదే

గెలుపోటములతో సంబంధం లేకుండా టెస్టుల్లో వేగంగా ఆడడం ద్వారా ఈ ఆటకు మరింత ఆదరణ పెరిగేలా చేయడంలో మాత్రం బ్రెండన్ మెక్ కల్లమ్ తోపాటు ఇంగ్లాండ్ జట్టు సఫలం అయిందనే చెప్పాలి.

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 07:20 PM IST
    Follow us on

    Brendon Mccullum : టెస్ట్ క్రికెట్ అనగానే జిడ్డు బ్యాటింగ్ తో రోజుల తరబడి ఆడుతూ డ్రా కోసం మాత్రమే ప్రయత్నించే ఆటగా క్రికెట్ అభిమానుల్లో ఒక అభిప్రాయం ఉంది. అనేక దేశాలు టెస్ట్ మ్యాచ్ ను ఇదే తరహాలో ఆడుతూ ఉన్నాయి. కానీ, ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఈ ఆటలో సరికొత్త విధానాన్ని గత కొన్నాళ్ల నుంచి అవలంబిస్తుంది. డ్రా కోసం టెస్ట్ ఆడాలన్న సాంప్రదాయానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఇంగ్లాండ్ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తనదైన శైలిలో ఆడుతూ మిగిలిన జట్లకు ఇంగ్లాండ్ ఆదర్శంగా నిలుస్తోంది. కళ తప్పుతున్న టెస్టులకు కొత్త జీవం పోసిన ఆ జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా వేగమే మంత్రంగా ముందుకు సాగుతోంది. అయితే ఇంగ్లాండ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వెనుక ఒక లెజెండ్ క్రికెటర్ ఆలోచన ఉంది.
    ఇంగ్లాండ్ జట్టు గత కొన్నాళ్ల నుంచి టెస్టుల్లో సరికొత్త విధానాన్ని అనుసరిస్తోంది. బజ్ బాల్ పేరుతో అనుసరిస్తున్న ఈ విధానంలో భాగంగా వేగంగా ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. టెస్ట్ సిరీస్ లో అయితే వేగంగా ఆడడమే ఆయుధంగా చేసుకొని బరిలోకి దిగుతూ సత్ఫలితాలను సాధిస్తోంది.
    బ్రెండన్ మెక్ కల్లమ్ పేరుతోనే కొత్త వ్యూహం..
    న్యూజిలాండ్ ఓపెనర్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ సృష్టించిన విధ్వంసం ఎటువంటిదో క్రికెట్ అభిమానులకు బాగా తెలుసు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి గొప్ప విజయాలను అందించాడు. ఐపీఎల్ లోను కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అనేక మ్యాచ్ లు ఆడిన బ్రెండన్ మెక్ కల్లమ్ 2022లో ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. బ్రెండన్ మెక్ కల్లమ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. అటువంటి జట్టును ఏడాదిలోనే అద్భుతమైన విజయాలను సాధించే జట్టుగా తీర్చిదిద్దాడు బ్రెండన్ మెక్ కల్లమ్. తనదైన స్టైల్ విధ్వంసక ఆటను ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఒంటపట్టించాడు. స్ట్రోక్ ప్లేతో అలరించే బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక
    బ్రెండన్ మెక్ కల్లమ్ పని మరింత సులభమైంది. మెక్ కల్లమ్ ను అభిమానులు ముద్దుగా బజ్ అని పిలుస్తారు. దీంతో అతను నేర్పిన వేగమనే ఆటకు అదే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ విధానంలో జట్టు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆటగాళ్లు వేగంగా పరుగులు చేయడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు పెట్టుకుంది. ఈ విధానంలో ఇంగ్లాండ్ జట్టుకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆడుతున్న యాషెస్ సిరీస్ మొదటి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు ఓటమి చెందిన తర్వాత తీవ్ర విమర్శలను ఇంగ్లాండ్ ఆటగాళ్లతోపాటు కోచ్ ఎదుర్కొన్నారు. అయితే, వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంగ్లాండ్ జట్టు తన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ట్రాక్ లో పడింది. మూడో టెస్ట్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకోగా టెస్ట్ లోను విజయం దిశగా ఇంగ్లాండ్ జట్టు సాగుతోంది. వర్షం అంతరాయం కలిగించకపోతే ఐదో రోజు ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా టెస్టుల్లో వేగంగా ఆడడం ద్వారా ఈ ఆటకు మరింత ఆదరణ పెరిగేలా చేయడంలో మాత్రం బ్రెండన్ మెక్ కల్లమ్ తోపాటు ఇంగ్లాండ్ జట్టు సఫలం అయిందనే చెప్పాలి.
    ఇదే విషయాన్ని వెల్లడించిన శ్రీలంక క్రికెటర్ సంగక్కర
    ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహం గురించి మాట్లాడుతూ శ్రీలంక క్రికెటర్ సంగక్కర ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. అప్పటి వరకు వైట్ బాల్ కోచ్ గా అనుభవం ఉన్న మెక్ కల్లమ్.. ఎర్ర బంతితో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడని స్పష్టం చేశాడు. టెస్టులు అంటే సాగతీత ఆట కాదని నిరూపించాలని అనుకున్నాడు అని, అందుకు అనుగుణంగానే కొత్తరకం ఆటను పరిచయం చేశాడని సంగక్కర వివరించాడు. దీంతో ఈ ఫార్మాట్ ను ఎక్కువ మంది అభిమానులకు దగ్గర చేశాడని వెల్లడించాడు. ఈ విధానంలో గతేడాది నుంచి ఇంగ్లాండ్ అద్భుత ఫలితాలను రాబడుతోంది. గడిచిన ఏడాది పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సస్టోక్స్ సేన మూడు టెస్టుల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. స్వదేశంలో ఐర్లాండ్ తో జరిగిన ఏకైక టెస్ట్ లోను సంచలన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లోను ఇంగ్లాండు జట్టు అదరగొడుతోంది.