Ireland Vs Pakistan: ఐర్లాండ్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాక్.. ఇందుకేనా ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది..

డబ్లిన్ వేదికగా శుక్రవారం పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఐర్లాండ్ ఓడించింది. టి20 లలో పాకిస్తాన్ పై ఐర్లాండ్ కు ఇదే తొలి విజయం. చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 11, 2024 3:38 pm

Ireland Vs Pakistan

Follow us on

Ireland Vs Pakistan: ఊరందరిదీ ఒక దారయితే.. ఉలిపి కట్టేది మరో దారట.. ఈ సామెత తీరుగానే ఉంది పాకిస్తాన్ జట్టు వ్యవహారం. ఆమధ్య టి20 వరల్డ్ కప్ కు నోటిఫికేషన్ విడుదల కాగానే .. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆర్మీ చేతిలో ట్రైనింగ్ తీసుకుంది. ఈసారి ఎలాగైనా కప్ సాధిస్తామని ఆ జట్టు క్రికెట్ బోర్డు చెప్పింది. అందుకే తమ జట్టు ఆటగాళ్లకు సైన్యంతో శిక్షణ ఇప్పిస్తున్నామని గర్వంగా చెప్పింది. కానీ, ఆ శిక్షణ ఎంతటి ఫలితం ఇచ్చిందో న్యూజిలాండ్ సిరీస్ తో తేలిపోయింది. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఎదురైన ఫలితాన్ని మర్చిపోకముందే.. ఐర్లాండ్ పర్యటనకు పాకిస్తాన్ వెళ్ళింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి టి20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ ఏడవ స్థానంలో, ఐర్లాండ్ 11వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ జట్టుతో పోల్చితే ఐర్లాండ్ అంత బలమైన జట్టు కాదు. కానీ, పాకిస్తాన్ ఆటగాళ్లు ఆ జట్టు ముందు తేలిపోయారు. ఏకపక్షంగా సాగాల్సిన మ్యాచ్లో చేతులెత్తేశారు.

డబ్లిన్ వేదికగా శుక్రవారం పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఐర్లాండ్ ఓడించింది. టి20 లలో పాకిస్తాన్ పై ఐర్లాండ్ కు ఇదే తొలి విజయం. చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 రన్స్ చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 57, అయూబ్ 45, ఇఫ్తికర్ అహ్మద్ 37 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మహమ్మద్ రిజ్వాన్ 1, షాదాబ్ ఖాన్ (0) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ రెండు వికెట్లు తీశాడు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. బాల్ బిర్నీ 77, టెక్టర్ 36, డాక్ రెల్ 24 పరుగులు చేసి ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు పడగొట్టారు.

మరి కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్ పర్యటన అనంతరం, ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ద్వితీయశ్రేణి ఆటగాళ్లతో జరిగిన సిరీస్ లో పరాజయాన్ని చవిచూసింది. దీనిని మర్చిపోకముందే ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ఆటగాళ్ల బేలతనాన్ని సూచిస్తోంది. ఇక టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ ఏ జాబితాలో భారత్, పాకిస్తాన్, కెనడా, అమెరికా, ఐర్లాండ్ ఉన్నాయి. ఐర్లాండ్ లాంటి చిన్న దేశంపై పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్ జట్టులో ఆ జట్టు క్రికెట్ బోర్డు అనేక మార్పులు చేసింది. బాబర్ అజామ్ కు తిరిగి కెప్టెన్సీ ఇచ్చింది. వైట్ బాల్ టీంకు కోచ్ గా గ్యారి కిర్ స్టెన్ నియమించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఆటలో పెద్దగా మార్పు రాలేదు.. 3 t20 ల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో పాకిస్తాన్ రెండవ మ్యాచ్ ఆదివారం ఆడనుంది.